'పౌర' జ్వాల: ఆందోళనలతో దద్దరిల్లిన దిల్లీ 'పౌర' చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో దిల్లీ దద్దరిల్లింది. ఉదయం నుంచి వేలాది మంది త్రివర్ణ పతాకాలను చేతబట్టి, "రాజ్యాంగాన్ని రక్షించండి" అనే నినాదాలతో హస్తిన వీధుల్ని హోరెత్తించారు.
దిల్లీ గేటు వద్ద ఉద్రిక్తత
శుక్రవారం ప్రార్థనల తర్వాత జామా మసీదు వద్ద వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. భీమ్ ఆర్మీ సారథి ఆజాద్ చంద్రశేఖర్ ఇందుకు నేతృత్వం వహించారు. వీరంతా 'పౌర' చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్‌కు ర్యాలీగా వెళుతుండగా పోలీసులు దిల్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్తకర పరిస్థితి తలెత్తింది. చౌరీ బజార్, లాల్ క్వైలా, జామా మసీద్, దిల్లీ గేటు మెట్రో స్టేషన్లను మూసివేయాల్సి వచ్చింది.
షా ఇంటి ముట్టడికి యత్నం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటిని దిల్లీ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు వినూత్న రీతిలో పోలీసులకు గులాబీ పూలు ఇచ్చి నిరసన తెలిపారు.
డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ
జఫ్రాబాద్ నుంచి శీలంపుర్కు నిరసనకారులు ప్రదర్శన చేపట్టగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. శీలంపుర్‌లో 144 సెక్షన్ విధించారు. ఈశాన్య దిల్లీలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
సీమాపురిలో నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో షహదారా అడిషనల్ డీసీపీ రాజ్బీర్ సింగ్ గాయపడ్డారు. తలకు రాయి బలంగా తగలగా ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మరోమారు హింస
దర్యాగంజ్‌లో సాయంత్రం వందల మంది రోడ్డెక్కగా మరోమారు హింస చెలరేగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక కారుకు నిప్పు పెట్టారు.