కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.
నేటితో తొమ్మిది రోజుల విచారణ గడువు పూర్తయిన నేపథ్యంలో శివకుమార్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు. నిజానిజాలు బయటపడాలంటే కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని కోర్టును కోరారు.
అధికారుల అభ్యర్థన మేరకు శివకుమార్‌ను 17వ తేదీ వరకు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కాంగ్రెస్ నేత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16 లోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం.
నిజాన్ని దాస్తున్నారు
అంతకుముందు... కస్టడీ పొడిగింపుపై వాడీవేడి వాదనలు జరిగాయి. శివకుమార్ నిజాలను దాచేందుకు చూస్తున్నారని, విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పారని కోర్టుకు తెలిపారు అధికారులు. ఆయనకు చెందిన రూ.800 కోట్ల ఆస్తులు బినామీల పేరిటే ఉన్నాయని, 317 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.200 కోట్లకుపైగా అక్రమ లావాదేవీలు జరిపారని నివేదించారు.