సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందంటూ వచ్చిన ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారానికి దారితీస్తున్నాయి. ఈ విషయంలో భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్.. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఫేస్బుక్ జోక్యం చేసుకుందని ఆరోపించింది. తాజాగా ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత్‌లోని ఫేస్బుక్ నాయకత్వం, వారి కార్యకలాపాలపై విచారణ జరపాలని స్పష్టం చేశారు.
దర్యాప్తును ప్రభావితం చేయకుండా ఉండాలంటే భారత కార్యకలాపాలకు కొత్త బృందాన్ని ఎంచుకోవాలని వేణుగోపాల్ పేర్కొన్నారు.
"ఫేస్బుక్ ఇండియా నాయకత్వం, వారి కార్యకలాపాలపై ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఒకటి, రెండు నెలల్లో నివేదికను ఫేస్బుక్ బోర్డ్‌కు అందించాలి. ఈ నివేదికను ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉంచాలి."
-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కాంగ్రెస్ వ్యవస్థాపక నాయకులు ప్రాణత్యాగం చేసి కాపాడిన విలువలు, హక్కులను అడ్డుకునే కార్యక్రమంలో ఫేస్బుక్ పాల్గొనవచ్చని కేసీ వేణుగోపాల్ ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఫేస్బుక్లో చేసిన విద్వేషపూరిత పోస్టులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
"ముగ్గురు రాజకీయ నేతల విద్వేష ప్రసంగాలకు ఫేస్బుక్ ఇండియా కావాలనే అనుమతిచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఆగస్టు 14న ప్రచురించిన ఈ కథనం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. చాలా మంది ఫేస్బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లు పక్షపాత వైఖరితో ఉన్నారన్న విషయాన్ని కాంగ్రెస్ చాలా సార్లు లేవనెత్తింది."
-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి