తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆధారాలేవీ?' - TWEETS

జైషే మహ్మద్​ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడి సాక్ష్యాధారాలు బయటపెట్టాలని మరోమారు డిమాండ్ చేసింది కాంగ్రెస్​. సాయుధ దళాలను కాంగ్రెస్​ అవమాన పరుస్తోందని భాజపా ఎదురుదాడికి దిగింది.

భాజపాపై కాంగ్రెస్​ ఆరోపణలు

By

Published : Mar 4, 2019, 5:20 PM IST

బాలాకోట్​ మెరుపుదాడులపై కేంద్రమంత్రి ఎస్​ఎస్​ అహ్లువాలియా వ్యాఖ్యల అనంతరం అధికార భాజపాపై విమర్శల దాడిని తీవ్రం చేసింది కాంగ్రెస్​. ప్రధాని నరేంద్రమోదీ... ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు ఆ పార్టీ​ అగ్రనేతలు. భారత వాయుసేన దాడికి సంబంధించి ఆధారాలు కావాల్సిందేనని డిమాండ్​ చేశారు.

''న్యూయార్క్​ టైమ్స్​, వాషింగ్టన్​ పోస్ట్​, లండన్​ ఆధారిత జేన్​ సమాచార సంస్థ, డైలీ టెలిగ్రాఫ్​, ద గార్డియన్​, రాయిటర్స్​ వంటివి పాకిస్థాన్​ బాలాకోట్​లో ఉగ్రవాదులు హతం అయ్యారనేందుకు ఆధారాలేమీ లేవని వార్తలు ప్రచురించాయి. మోదీ దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఉగ్రవాదాన్ని రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు.''

- కపిల్​ సిబల్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ట్విట్టర్​ వేదికగా ప్రధానమంత్రిని ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఎస్​ఎస్​ అహ్లువాలియాకు సంబంధించిన వార్తను ట్వీట్​కు జోడించారు.

''మోదీజీ... మీ కేంద్రమంత్రి టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలను కల్పితమైనవని పేర్కొన్నారు. బాలాకోట్​ వైమానిక దాడిలో 300మంది ఉగ్రవాదులు చనిపోయారని మోదీ ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇది నిజమా? ఒకవేళ కాకపోతే... మోదీ కచ్చితంగా దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందే. నిజమేంటో చెప్పాలి. ''

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి ఎస్​ఎస్​ అహ్లువాలియా సిలిగుడిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కానీ, ఏ ఇతర ప్రభుత్వ ప్రతినిధులు వైమానిక దాడి నష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. భారత మీడియా, సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. గందరగోళంలో పడేసే ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్​ మోదీని వివరణ కోరింది.

''300 మంది ఉగ్రవాదులు మరణించారనేది నిజమా? కాదా? ప్రయోజనమేముంది? మీరు నిర్మూలించేది ఉగ్రవాదులనా... చెట్లనా. ఇది ఎన్నికల గిమ్మిక్కేనా.?'' అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ నేత నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ.

అవమానించడమే...

కాంగ్రెస్​ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భాజపా అంతే స్థాయిలో బదులిచ్చింది.

''ఉగ్రవాద వ్యతిరేక భద్రతా దళాల చర్యను కాంగ్రెస్​.. ఆ పార్టీ మిత్రపక్షాలు భవిష్యత్తులోనూ స్వాగతించే అవకాశమే లేదు. కానీ... కనీసం దేశాన్ని తప్పుదోవ పట్టించకుండా ఉంటే చాలు. నకిలీ, కల్పిత కథనాలతో సాయుధ దళాలను అవమానించవద్దు.''

- ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మంత్రి

ABOUT THE AUTHOR

...view details