ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఐదేళ్ల పాలనలో మోదీ విధానాలతో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని కాంగ్రెస్ మరోసారి విమర్శించింది. గ్రామీణ భారతంలో 3.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని జాతీయ నమూనా సర్వే సంస్థ పేర్కొంది. ఈ నివేదికను ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఈ వార్తను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వ పాలనలో సుమారు 3.2 కోట్ల మంది సాధారణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. భాజపా చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజలు సహించరన్నారు. రానున్న ఎన్నికల్లో భాజపాను ఓడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.