భాజపాకు లబ్ధి చేకూర్చబోమని ప్రియాంక గాంధీ వ్యాఖ్య ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉన్నారని.. ఎన్నికల్లో భాజపాకు గట్టి పోటీనిస్తామని పేర్కొన్నారు కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. భాజపా ఓట్లు చీల్చడమే లక్ష్యంగా.. ఉత్తర్ప్రదేశ్లో అభ్యర్థులను బరిలోకి దింపామన్న వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడారు ఆమె.
వివాదాస్పదమయ్యేలా ప్రియాంక ఏమన్నారో ఇక్కడ చూడండి
ప్రియాంక మాటల్ని తప్పుబట్టారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్- భాజపాలు.... ఎస్పీ-బీఎస్పీ కూటమికి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థులు గెలిస్తే ఏం కాదని.. కూటమి అభ్యర్థులు మాత్రం అసలు గెలవొద్దని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు మాయావతి.
అఖిలేశ్ యాదవ్ ఇదే అంశంపై కాంగ్రెస్ను తప్పుబట్టారు. ఈ వరుస విమర్శల వేళ.. కాంగ్రెస్ కార్యదర్శి స్పందించారు.
''రాజకీయాల్లో భాజపా మా ప్రధాన విరోధి. వారితో ఎప్పుడూ తలపడుతున్నాం. మేం ఎల్లప్పుడూ వారితో పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మళ్లీ రాకూడదు. తూర్పు ఉత్తరప్రదేశ్లో నేను, పశ్చిమాన సింధియా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. మేం ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి లబ్ధి చేకూర్చట్లేదు. మేం వారికి మరింత గట్టి పోటీనిస్తాం. మా అభ్యర్థులూ బలంగా ఉన్నారు. మా కార్యకర్తల్ని లాక్కోవాలని చూస్తున్నారు. పార్టీ మా వెంటే ఉంటుంది. మా భావజాలం భాజపాకు పూర్తి వ్యతిరేకం.''
- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.