ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఓ వ్యక్తి ఐదుగురి ప్రాణాలను కాపాడారు. తాలూకా విపత్తు స్పందనా దళం(టీడీఆర్‌ఎఫ్) వలంటీర్ ఆసిఫ్ కొండోటి ప్రమాదం గురించి తెలిసిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని.. ఐదుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.
విమానం రెండు ముక్కలుగా పడి ఉన్న దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఆసిఫ్. అక్కడి మహిళలు, పిల్లలు సాయం కోసం ఎదురుచూస్తున్నారని... తక్షణమే తాను రక్షణ చర్యలు చేపట్టానని చెప్పారు. అంబులెన్సులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాకముందే స్థానికుల సాయంతో వారి వారి వాహనాలు, టాక్సీల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
అయితే... రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ఆసిఫ్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించి కో పైలట్ అఖిలేశ్ కుమార్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అఖిలేశ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు చెప్పారు..
''ఆ సమయంలో నేను పైలట్(కెప్టెన్ దీపక్ సాథే) వద్దకు వెళ్లి పల్స్ చెక్ చేశాను. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. అక్కడే తీవ్ర గాయాలతో ఉన్న కో పైలట్(అఖిలేశ్ కుమార్) నాడీని పరిశీలించగా.. ఆయన ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించాం.''