తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయ రంగ సమస్యలు తీర్చండి'

వ్యవసాయ రంగంలోని సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి కేంద్రీకరించాలని నీతి ఆయోగ్ వేదికగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగానికి చేయూత అందించేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయాలన్నారు.

'వ్యవసాయ రంగ సమస్యలు తీర్చండి'

By

Published : Jun 16, 2019, 6:41 AM IST

Updated : Jun 16, 2019, 10:27 AM IST

'వ్యవసాయ రంగ సమస్యలు తీర్చండి'

వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు ప్రకృతి విపత్తులు, జీఎస్​టీ వల్ల ఉత్పన్నమయిన సమస్యలపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

వ్యవ'సాయం'పై

కరవు పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంపై పునరాలోచించాలన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం 33 శాతం పంట నష్టం జరిగితే పరిహారం చెల్లించేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారని, దాన్ని 20 శాతానికి తగ్గించాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అందే పంట రుణాన్ని భూవిస్తీర్ణం ఆధారంగా కాక పంటను పరిగణనలోకి తీసుకుని అందించాలన్నారు.

కరవు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి సంబంధించిన నియమాలను మార్చాలన్నారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని. ఉపాధి హామీ పని దినాలను 150 నుంచి 200లకు పెంచాలని డిమాండ్ చేశారు.

తమ రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నా 115 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేశామన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. పంటల ఉత్పత్తిపై మరాఠా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమావేశం వేదికగా వివరించారు.

'రాష్ట్రాలకు సహకరించండి'

⦁ వరదలతో అతలాకుతమైన కేరళకు సహాయాన్నందించాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. నీతి ఆయోగ్ అంచనాల మేరకు పనిచేయలేకపోయిందని వ్యాఖ్యానించారు.

⦁ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తికై డిమాండ్ చేశారు దేశ రాజధాని ప్రాంత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దశాబ్దాలుగా ఉన్న ఈ డిమాండ్​ను నెరవేర్చాలన్నారు.

⦁ గిరిజన, పేద కుటుంబాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని ఛత్తీస్​గడ్ సీఎం భూపేశ్ బఘేల్ అభ్యర్థించారు. ఇంటింటికి మంచినీటిని అందించే పథకానికి నూరు శాతం గ్రాంటుకై విన్నవించారు.

⦁ తమిళనాడులో చేపడుతున్న ప్రాజెక్టులకు చేయూత అందించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖ అందించారు. నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్​లతో సమావేశమయ్యారు.

⦁ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న అసోంను ఆదుకోవాలని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేంద్రాన్ని కోరారు.

⦁ కరవు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కర్ణాటక సీఎం కుమారస్వామి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకునేందుకు రూ.2064 కోట్లు, ఉపాధి హామి బకాయి రూ. 1500 కోట్ల మంజూరుకై విన్నవించారు.

⦁ పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలన్నారు ముఖ్యమంత్రి నారాయణ స్వామి.

ఇదీ చూడండి: అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచిన భారత్​

Last Updated : Jun 16, 2019, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details