తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మతపరమైన విభజన లేని పౌరసత్వ చట్టం అవసరం' - citizenship bill

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టంపై దేశంలోనే కాక అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమవుతోంది. భారత్​లోని భిన్న వర్గాల ప్రజలు వివిధ కారణాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సవరణపై పక్క దేశాల వైఖరి ఏంటి? దేశంలో జరుగుతున్న నిరసనలకు ప్రధాన కారణమేంటి? ఇందుకు పరిష్కారం ఏంటి? అనే అంశాలపై మాజీ దౌత్యవేత్త అచల్​ మల్హోత్రా వ్యాసం మీకోసం.

Citizenship Amendment Act: Fall out at Home and Abroad  By Ambassador Achal Malhotra,
'మతపరమైన విభజన లేని పౌరసత్వ చట్టం అవసరం'

By

Published : Dec 23, 2019, 3:40 PM IST

పౌరసత్వ చట్ట సవరణ.... మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంస్కరణ. అయితే... చట్ట సవరణపై స్వదేశంలోనే కాక విదేశాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లిందేశాలతో పాటు ముస్లిమేతర దేశాల నుంచి ప్రతికూల స్వరాలు వినిపిస్తున్నాయి.

ఏంటీ సీఏఏ...?

పొరుగు దేశాల్లో(పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్​) మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్​ 31కి ముందు దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు(హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు, క్రైస్తవులు​) భారత పౌరసత్వం కల్పించడమే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అసలు ఉద్దేశం. ఆయా దేశాల్లో మెజారిటీ ప్రజలు ముస్లింలే కావడం వల్ల తాజా చట్ట సవరణలో వారిని మైనారిటీలలో చేర్చలేదు.

అయితే... కేవలం మూడు దేశాలను ఎంచుకోవడం, మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తామని చట్టంలో పేర్కొనడం విమర్శలకు కారణమైంది. దేశంలో పలు వర్గాల ప్రజానీకం వివిధ కారణాలతో ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఆర్టికల్ 14కు విఘాతం...!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రతిపాదించిన సమానత్వపు హక్కుకు తాజా చట్టం విఘాతం కలిగిస్తోందని, లౌకికతత్వ విధివిధానాలను ఇది తుంగలో తొక్కుతోందన్నది ప్రతిపక్షాల ప్రధాన వాదన. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సైతం ఇదే తరహాలో స్పందించింది. 'చట్టం ముందు అందరూ సమానులే' అన్న వాదనకు కట్టుబడి ఉన్న భారతదేశ రాజ్యాంగ విధానాన్ని తాజా పౌరసత్వ చట్ట సవరణ నీరుగారుస్తోందని ఐరాస మానవహక్కుల మండలి హైకమిషనర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. పౌరసత్వం పొందడంలో తాజా సవరణలు ప్రజలపై వివక్షాపూరిత ప్రభావం చూపుతాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈశాన్యానిది ఉనికి కోల్పోతామనే భయం

తమ ఉనికిని కోల్పోతామనే భయాలే... పౌరసత్వ చట్ట సవరణను ఈశాన్య రాష్ట్రాలు అందరికంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడానికి ప్రధాన కారణం. ఇప్పటికే భారీ సంఖ్యలో వలసదారులు పక్కదేశాల నుంచి(ప్రధానంగా బంగ్లాదేశ్) అక్రమంగా భారత్​లోకి చొరబడ్డారు. వారిలో అధిక శాతం ఈశాన్య రాష్ట్రాల్లో, అందులోనూ అసోంలోనే స్థిరపడ్డారు. వారి కారణంగా తమ రాష్ట్రం ప్రాంతీయ, భాషాపరమైన మార్పులకు లోనవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక్కడే పుట్టిపెరిగిన వారి ఉనికి ప్రమాదంలో పడిపోతుందేమోనని భయపడుతున్నారు. సొంత రాష్ట్రంలోనే తమను మైనారిటీలుగా వర్గీకరిస్తారేమోనని పలు జాతులు భయాందోళనలు వెలిబుచ్చుతున్నాయి.

ముస్లింల నిరసనకు కారణమదే

విదేశాల నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులకు పౌరసత్వం కల్పించకుండా దేశం నుంచి తరిమేస్తారన్న భావనతోనే భారత్​లోని ముస్లింలు నిరసన చేస్తున్నారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శిస్తున్నారు.

ఆ మూడు దేశాల్లో

భారత్​లోనే కాక విదేశాల్లోనూ పౌరసత్వ చట్టం ప్రకంపనలు రేపింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మైనారిటీలు మతపరమైన హింసకు గురవుతున్నారనే విషయాన్ని ఈ చట్టం వేలెత్తి చూపించింది. గత కొద్ది కాలంగా ఆ మూడు దేశాల్లో మైనారిటీల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఆయా దేశాలు, వాటి మద్దతుదారులు ఈ చట్టంపై ప్రతికూలంగా స్పందించడం సాధారణ విషయమే.

ఎగసిపడ్డ పాక్​

భారత్​పై విషం చిమ్మడానికి ఎప్పుడూ కాచుకుని కూర్చునే పాకిస్థాన్ పౌరసత్వ చట్ట సవరణపై వెంటనే స్పందించింది. కొత్త చట్టం నుంచి వివక్షాపూరిత అంశాలను తొలగించాలని ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ శరణార్థుల వేదిక ఆధ్వర్యంలో జెనీవాలో జరిగిన సదస్సులో భారత్​కు వ్యతిరేకంగా మాట్లాడింది. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా భవిష్యత్తులో శరణార్థుల సంక్షోభం తలెత్తుతుందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జోస్యం చెప్పారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధానికి కారణం కావచ్చని మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు.

బంగ్లా నిరసన

పౌరసత్వ చట్ట సవరణపై దుమారం రేగిన తొలినాళ్లలోనే భారతదేశానికి తమ హోం, విదేశాంగ మంత్రుల పర్యటన రద్దు చేసుకొని బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది. అనంతరం భారత లౌకికతత్వాన్ని ప్రభుత్వ విధానాలు బలహీనపరుస్తాయని బంగ్లాదేశ్ హోంమంత్రి విమర్శించారు. బంగ్లాదేశ్​లో మైనారిటీలపై హింస జరుగుతుందన్న వాదనను ఖండించారు.

సిక్కులు సహా తమ దేశంలో ఉన్న అన్ని మైనారిటీలను అఫ్గాన్ గౌరవిస్తోందని ఆ దేశ భారత రాయబారి దిల్లీలో స్పష్టం చేశారు.

మధ్యలో మలేషియా

ఆర్టికల్-370 రద్దుపై తీవ్రంగా స్పందించిన మలేషియా ఈసారి భారత్​పై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం వదిలిపెట్టలేదు. ఈ బిల్లు తీసుకురావడానికి గల ఉద్దేశమేంటో చెప్పాలంటూ భారత్​ను ప్రశ్నించారు ఆ దేశ ప్రధాని మహతిర్ మహ్మద్. ఇస్లామిక్ ప్రపంచంలో తాను ముస్లింల పాలిట హీరోగా ఉద్భవించాలన్న స్వీయ ఆశయాలకు అనుగుణంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

ప్రమాదకరమైన మలుపు!

పశ్చిమదేశాల్లోనూ పౌర చట్టానికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. మానవహక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, సమానత్వపు హక్కు అంటూ ఈ చట్టంపై విమర్శలు చేస్తున్నారు. అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్​ 'సీఏఏ'ను 'తప్పుడు దిశలో వెళ్తున్న ప్రమాదకరమైన మలుపు'గా అభివర్ణించింది. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. వీటిని విదేశాలు వ్యాప్తి చేస్తున్న అవాస్తవాలుగా పేర్కొంది.

సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి

ఈ చట్టంపై పాకిస్థాన్ వంటి దేశాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోనవసరం లేదు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతమున్న స్థాయి కంటే దిగజారే అవకాశం లేదు. అయితే బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​లతో సంబంధాలు దెబ్బతినకుండా భారత్ కాపాడుకోవాలి. ఈ రెండు దేశాలకు భారత్ కొంతవరకు సమాధానం ఇవ్వగలిగింది. గతంలో మైనారిటీలపై అఫ్గాన్ తాలిబన్లు చేసిన అఘాయిత్యాలు, బంగ్లాదేశ్​ సైన్యం హింసాత్మక చర్యలు వంటి అంశాలతో ఆయా దేశాల లోటుపాట్లు తెలియచెప్పింది భారత్.

అజెండా హిందూ దేశం

పౌరసత్వ చట్ట సవరణ ద్వారా దేశంలో విభజన కుట్రలు జరుగుతున్నాయన్న వివాదాస్పద ప్రచారాలు... లౌకిక దేశమని భారత్​కు అంతర్జాతీయంగా ఉన్న పేరుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారత్​ను హిందూ మెజారీటీ ఉన్న దేశం(హిందూ రాష్ట్ర)గా మార్చాలనే తలంపుతో పనిచేస్తోందన్న వాదనలు వీటికి ఆజ్యంపోస్తున్నాయి. 'సీఏఏ'పై ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలలు... దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలుపైనా తప్పకుండా ప్రభావం చూపుతాయి.

మత ప్రస్తావన లేకుండా చేస్తే

శరణార్థులను మతపరమైన మైనారిటీల అంశం ఆధారంగా విభజించకుండా ఉంటే వివాదానికి అడ్డుకట్టవేయవచ్చన్నది నా అభిప్రాయం. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్​లో మతపరమైన హింస ఎదుర్కొని 2014 డిసెంబర్ 31కు ముందు దేశానికి వలసవచ్చిన వారందరూ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రతిపాదించాలి. దేశ భద్రత సహా అన్ని అంశాలు బేరీజు వేసి వారికి పౌరసత్వాన్ని కల్పిస్తామని ప్రతిపాదించవచ్చు. వారి దరఖాస్తును తిరస్కరించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉండేలా ప్రకటించాలి. తద్వారా ప్రభుత్వం అనుకున్నట్లు దేశంలో ఆస్తి, ప్రాణ నష్టం నివారించి, సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తపడ్డట్లు అవుతుంది. సీఏఏపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలైనందున దీనిపై ధర్మాసనం వైఖరేంటో తెలియాల్సి ఉంది. అంతకన్నా ముందు దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నుంచి బయటపడటం ముఖ్యం.
(రచయిత - అచల్​ మల్హోత్రా, విశ్రాంత ఐఎఫ్​ఎస్​ అధికారి).

ఇదీ చదవండి: ఆపరేషన్​ ఎన్​ఆర్​సీ: ఏకాకిలా భాజపా- ఎలా ముందుకు?

ABOUT THE AUTHOR

...view details