స్విట్జర్లాండ్లో భారతీయులపై నమోదైన నల్లధనం కేసుల వివరాలను గోప్యత కారణాల దృష్ట్యా వెల్లడించేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు స్పందించిన ఆర్థిక మంత్రిత్వశాఖ.. నల్లధన సమాచారం రహస్య పరిశీలనలో ఉందని తెలిపింది.
స్విట్జర్లాండ్ నుంచి స్వీకరించిన నల్లధనం కేసుల వివరాలు, సంబంధిత సంస్థలు, వ్యక్తుల పేర్లు తెలపాలని.., ఆ సమాచారం ఆధారంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించాలని ఓ పాత్రికేయుడు సహ చట్టం కింద దరఖాస్తు చేశారు.
పన్ను సమాచారం, ఇతర ఆర్థిక వివరాలు ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్, స్విట్జర్లాండ్ 2016 నవంబర్ 22న ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందానికి లోబడి ఈ సంవత్సరం నుంచి స్విట్జర్లాండ్లోని భారతీయుల ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ భారత్కు వస్తాయని విత్త మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సమాచారం నల్లధనాన్ని గుర్తించడం సహా, స్విట్జర్లాండ్లోని భారతీయుల ఆస్తులను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అయితే... దేశం లోపల, వెలుపల ఎంత నల్లధనం చలామణిలో ఉందో తెలిపే కచ్చితమైన అంచనా లేదని స్పష్టం చేసింది.