తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​పై మరోసారి చైనా కుటిల నీతి

జైషే మహ్మద్​ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ విషయంలో భారత్​కు చైనా మరోసారి మోకాలడ్డింది. అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాసలో చేసిన ప్రతిపాదనలను చైనా తిరస్కరించింది.

ఐరాస

By

Published : Mar 14, 2019, 7:29 AM IST

Updated : Mar 14, 2019, 10:53 AM IST

భారత్​పై మరోసారి చైనా కుటిల నీతి
చైనా మరోసారి కుటిల నీతిని బయటపెట్టింది. జైషే మహ్మద్ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనలను చైనా తిరస్కరించింది. పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని జైషే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మసూద్​ను 1267 ఆంక్షల జాబితాలో చేర్చాలని ఐరాస భద్రతా మండలిలో ఫిబ్రవరి 27న ఫ్రాన్స్ ప్రతిపాదించింది. ఫ్రాన్స్​కు అమెరికా, బ్రిటన్​ సైతం మద్దతిచ్చాయి.

ప్రతిపాదనలపై ఆంక్షల కమిటీకి పది రోజుల్లోగా సభ్య దేశాలు అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. బుధవారం గడువు ముగిసే సమయానికి చైనా అడ్డుపుల్ల వేసింది. దీనిపై మరింత సమయం కావాలని చైనా కోరినట్టు భారత దౌత్యవేత్త తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.

"మేం చాలా నిరాశపడ్డాం. భారత పౌరులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు శిక్ష పడేంత వరకూ అంతర్జాతీయ వేదికల్లో మా గళాన్ని వినిపిస్తాం. మాకు మద్దతుగా నిలిచిన దేశాలన్నింటికీ కృతజ్ఞతలు."
-భారత విదేశాంగ శాఖ

ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రి లూ కాంగ్ తమ దేశ వైఖరి తెలిపారు.

"ఐరాస భద్రతా మండలి, దాని అనుబంధ సంస్థలు కఠిన నిబంధనలు పాటిస్తాయి. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఆంక్షల విషయంలో మేం ఇప్పటికే చాలా సార్లు మా వైఖరి తెలియజేశాము. 1267 కమిటీ విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాం. అజార్​ విషయంలో అన్ని వర్గాలను సంప్రదించి నిజాయతీగా స్పందిస్తాం. మండలి నిబంధనలు అనుసరిస్తూ అన్ని పక్షాలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తాం."
-లూ కాంగ్, చైనా విదేశాంగ మంత్రి

ఇదే మొదటిసారి కాదు

అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్పదేళ్లుగాప్రయత్నిస్తోంది. అయితే ఆంక్షల కమిటీ సభ్యులందరి అభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. గడువు పూర్తయ్యేలోపు ఏ దేశమూ అభ్యంతరం తెలపకపోతే ఆంక్షలు జారీ అవుతాయి. అయితే అజార్ విషయంలో ఇప్పటికే మూడు సార్లు చైనా అడ్డుపడింది.

  • 2009లో అజార్​ను ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్​ ప్రతిపాదించింది.
  • 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి నేపథ్యంలో అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ సహకారంతో మరోసారి మండలిని కోరింది.
  • 2017లో భారత్ ప్రమేయం లేకుండానే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదనలు చేశాయి.

ఈ మూడు సందర్భాల్లో వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా భారత ప్రయత్నాలను అడ్డుకుంది.

ఇదీ చూడండి:ఉగ్రవాదంపై చర్యలకు పాక్​ హామీ

Last Updated : Mar 14, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details