వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లు, కేటాయింపులను అనుసంధానించాలని కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. వ్యవసాయ రంగ సంస్కరణలపై ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత కమిటీ మొదటి సమావేశంలో ఈ విధంగా వ్యాఖ్యానించారుఫడణవీస్.
రైతు పండించిన పంట మార్కెటింగ్ అంశమై వ్యవసాయ, వాణిజ్య మంత్రుల మధ్య మరింత సహకారం ఉండాలని ఆకాంక్షించారు. అన్ని రాష్ట్రాలు ఒక్క తాటిపైకి వస్తేనే వ్యవసాయ రంగంలో సంస్కరణలు సాధ్యం అవుతాయని పేర్కొన్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 13 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినా వ్యవసాయానికి పెట్టుబడి సరిపోవడం లేదన్నారు. ఎక్కువమంది రైతులకు వ్యవస్థీకృత రుణాలు వచ్చేలా చూడాలని కోరారు. సబ్సిడీలను లక్ష్యంగా చేసుకోవడం కూడా కమిటీకి ఉన్న ప్రత్యామ్నాయమని వెల్లడించారు.
రాష్ట్రాల్లో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికీ ఈ కమిటీ లక్ష్యించింది. ఈ సమావేశంలో ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించే మార్గాలపైనా చర్చించారు. రైతుల ఆదాయం పెంపుపైనా కమిటీ చర్చించింది.
అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు మార్కెట్లు చేరువ చేయడం, ఈ-నామ్, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారం, సరైన విధంగా రాయితీల పంపిణీ అంశాలపై ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే నియమ నిబంధనలు ఖరారయ్యాయని, వీటిపై సూచనలను ఆగస్టు 7లోగా పంపించాలని తెలిపింది.
ముఖ్యమంత్రులతో కూడిన అత్యున్నత కమిటీ రెండో సమావేశం ఆగస్టు 16న జరగనుంది. హరియాణా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, సీఈఓ అమితాబ్ కాంత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లేఖ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు ఆదివాసీ 40 కి.మీ నడక