మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. నవంబర్లో రెండు రాష్ట్రాల ప్రస్తుతం అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల తేదీలను ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. మహారాష్ట్రలో 288 స్థానాలు, హరియాణాలో 90 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోడా ప్రకటించారు.
అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించనున్నట్లు దిల్లీలో వెల్లడించారు సునీల్. 24న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో 8.94 కోట్లు, హరియాణాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు సునీల్.
" మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 27 విడుదల కానుంది. నామినేషన్లకు అక్టోబర్ 4 చివరి తేదీ. అక్టోబర్ 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 7 వరకు గడువు. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 21న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు 24న జరుగుతుంది. "
- సునీల్ అరోడా, భారత ప్రధాన ఎన్నికల అధికారి.
2014లో ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించి అధికారాన్ని చేజిక్కించుకుంది.