తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయ దురుద్దేశంతోనే మా నాన్న అరెస్టు: కార్తీ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టుపై స్పందించారు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం. రాజకీయ దురుద్దేశంతోనే తన తండ్రిని అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఉన్నత వ్యవస్థల దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం ఉండదని ప్రకటించింది.

రాజకీయ దురుద్దేశంతోనే మా నాన్న అరెస్టు: కార్తీ

By

Published : Aug 22, 2019, 6:26 AM IST

Updated : Sep 27, 2019, 8:27 PM IST

రాజకీయ దురుద్దేశంతోనే తన తండ్రిని అరెస్టు చేశారన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ. ఇది కచ్చితంగా కక్షసాధింపు ధోరణేనని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా చిదంబరం అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ. కేసు విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, చేసిన పనులకు ఎదురయ్యే పరిణామాలను చిదంబరం అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించింది.

ఈడీ, సీబీఐ, మీడియాలోని ఓ వర్గంతో కలిసి చిదంబరం వ్యక్తిత్వ హననానికి.. భాజపా పాల్పడుతోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకూ సమాధానమిచ్చింది కేంద్ర కాషాయ దళం.

"ఏదైనా తప్పుచేస్తే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సింది చిదంబరమే. ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు పనిచేయవు. స్వతంత్రంగా వ్యవహరించే అధికారం వాటికి ఉంది."

- షానావాజ్ హుస్సేన్, భాజపా అధికార ప్రతినిధి.

ఎలాంటి పరిణామాలు ఎదురైనా సత్యాన్ని వెలికితీసే విషయంలో వెనక్కి తగ్గమని, సమర్థంగా పోరాడుతామని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

ప్రియాంక వ్యాఖ్యలపై స్పందించారు భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ.

"చిదంబరానికి ప్రియాంక గాంధీ మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించలేదు. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాకు అండగా నిలిచిన అనుభవం ఆమెకు ఉంది."

-అమిత్ మాలవీయా, భాజపా ఐటీ విభాగం చీఫ్

ఇదీ చూడండి: అధికారం నుంచి కారాగారం దాకా చిదంబరం

Last Updated : Sep 27, 2019, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details