అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య పెనవేసుకున్న బంధం సాధారణమైనది కాదనేది తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య అమితమైన గౌరవమర్యాదలే కాకుండా సుధృడ స్నేహ బంధం అల్లుకొని ఉంది. తామిద్దరం మంచి స్నేహితులమని ఇరుదేశాధినేతలు ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై నొక్కి చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయతా అభిమానాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయన్న విషయం తాజా ట్రంప్ పర్యటనలో మరోసారి రుజువైంది.
ఆత్మీయ ఆలింగనాలు..
భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్న అధ్యక్షుడికి ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అహ్మదాబాద్ పర్యటనలో మోదీ, ట్రంప్ ఇద్దరు మొత్తం ఆరు సార్లు ఆలింగనం చేసుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి దిగిన అధ్యక్షుడిని మొదట ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మోదీ. ఈ సమయంలో ఇరువురు బేర్ హగ్ ఇచ్చుకున్నారు.
బేర్ హగ్ అంటే ఎదుటి వ్యక్తిని సంరక్షిస్తున్నట్లు రెండు చేతులను ఆ వ్యక్తిపై వేసి ఆలింగనం చేసుకోవడం.
విమానాశ్రయంలో ట్రంప్‌కు మోదీ స్వాగతం పలికిన తర్వాత ఇద్దరు కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. సబర్మతి సందర్శన అనంతరం మోటేరా స్టేడియానికి పయనమయ్యారు.
మోటేరా స్టేడియంలో ప్రవేశించిన తర్వాత రెండు సార్లు కౌగిలించుకున్నారు మోదీ, ట్రంప్. స్టేడియంలో ప్రజలనుద్దేశించి అధినేతలిద్దరు ప్రసంగించారు. తమ ప్రసంగాలు ముగించిన తర్వాత ఇద్దరు మరో మూడు సార్లు ఆలింగనం చేసుకున్నారు.