జాబిల్లిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు కీలక విభాగాల సమ్మేళనం. మెకానికల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఈ మూడింటినీ శాస్త్రవేత్తలు అనుసంధానించారు. చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ నుంచి విడిపోయి జాబిల్లిపై మృదువుగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. ఐతే చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ సక్రమంగానే పని చేస్తోంది. చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ భద్రంగా ఉందని, దాని పనితీరు సాధారణంగానే ఉందని ఇస్రో అధికారులు వెల్లడించారు.
ఏడాది పాటు సేవలు..
2,379 కిలోల బరువున్న ఆర్బిటర్ ఏడాదిపాటు ఇది చంద్రుని కక్ష్యలో తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. సౌర ఫలకాల ద్వారా 1000 వాట్లు విద్యుదుత్పత్తి చేసే సామర్థ్యం ఆర్బిటర్‌కు ఉంది. భూమి మీదున్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్‌తో ఇది కమ్యూనికేషన్ చేస్తోంది.
తనలోని పరిశోధన పరికరాల సాయంతో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది ఆర్బిటర్. ఫోటోలు తీసి.. సంబంధిత డేటాను భూమిపైకి చేరవేస్తుంది. చంద్రుడి ఖనిజాల తీరు, అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా త్రీడీ మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. జాబిల్లి పుట్టుకను అర్థం చేసుకోవడంలో దోహదపడే డేటాను అందిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్‌రే ఉద్గారాలను పరిశీలిస్తుంది.