తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2 కౌంట్​డౌన్ షురూ.. రేపే ప్రయోగం - చంద్రయాన్​-2

చంద్రయాన్​-2 ప్రయోగం కౌంట్​డౌన్​ మరోసారి మొదలైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు ప్రారంభం కాగా... 20 గంటల అనంతరం సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగిలోకి ఎగరనుంది. జాబిల్లి దక్షిణ ధ్రువానికి వెళ్లనున్న తొలి రోవర్...​ చంద్రయాన్​-2 నే కావడం విశేషం.

చంద్రయాన్​-2 కౌంట్​డౌన్ షురూ.. రేపే ప్రయోగం

By

Published : Jul 21, 2019, 7:04 PM IST

Updated : Jul 21, 2019, 9:50 PM IST

చంద్రయాన్​-2 కౌంట్​డౌన్ షురూ..

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన చంద్రయాన్‌-2ను మరోసారి ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం 6:43 నిమిషాలకు కౌంట్​డౌన్​ మొదలైంది. అనంతరం 20 గంటల తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:43 నిమిషాలకు జీఎస్​ఎల్వీ మార్క్-​3 ఎమ్​-1 వాహకనౌక నింగిలోకి ఎగరనున్నట్లు ఇస్రో ఛైర్మన్​ కె.శివన్​ ప్రకటించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చంద్రయాన్‌-2ను జాబిల్లిపైకి పంపనున్నారు.

"చంద్రయాన్​-2 ప్రయోగ తేదీని ఇస్రో ఖరారు చేసింది. వివిధ పరీక్షల అనంతరం సాంకేతిక సమస్యలను పరిష్కరించాం. ఇది పూర్తి చేయడానికి ఒకటిన్నర రోజులు పట్టింది."
- కె శివన్​, ఇస్రో ఛైర్మన్​

దక్షిణధ్రువంపై తొలిసారి..

చంద్రయాన్​-2తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్​ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్​ చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు ఏ దేశమూ ఈ ఘనత సాధించలేదు. దక్షిణ ధ్రువంపై అనుకూల పరిస్థితులే.. ల్యాండ్​ చేయాలనుకోవడానికి ఓ కారణం.

జాబిల్లి కక్ష్యలోకి భారత్​ 2008లోనే చంద్రయాన్​-1 పేరుతో ఉపగ్రహాన్ని పంపించింది. ఇప్పుడు చేపట్టే ప్రయోగం.. చంద్రయాన్​-2 ద్వారా ఆర్బిటర్​, ల్యాండర్​, రోవర్​ను పంపనున్నారు.

ఆర్బిటర్​ పూర్తిగా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతుంది. ల్యాండర్​ జాబిల్లి ఉపరితలంపై దిగుతుంది. అనంతరం.. అందులోంచి రోవర్​ బయటికొచ్చి చంద్రుడిపై తిరగడం మొదలెడుతుంది.

మరోసారి సిద్ధం...

మొదటగా ఈ నెల 15వ తేదీ వేకువ జామున చంద్రయాన్‌-2 ప్రయోగించాలని ఇస్రో భావించింది. కానీ.. ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ట్యాంకర్‌లోని ప్రెజర్‌ బాటిల్‌లో లీకేజీ ఏర్పడటం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. సోమవారం మధ్యాహ్నానికి ఇంధనాన్ని వాహకనౌక నుంచి తీసేశారు.

తమిళనాడులోని మహేంద్రగిరి ఎల్‌పీఎస్‌సీ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు వాహకనౌకను తమ అధీనంలోకి తీసుకొని అప్పటి నుంచి వివిధ రకాల పరీక్షలు చేపట్టారు. లోపాలన్నింటినీ సరిదిద్దినట్లు నిర్ధరణ చేసుకున్నారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు చంద్రయాన్​-2ను ప్రయోగించనున్నారు. 54 రోజుల అనంతరం చంద్రయాన్​-2 చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

పూర్తి అధ్యయనం కోసం..

2008లో పంపిన చంద్రయాన్​ తర్వాత...మళ్లీ 11 ఏళ్లకు అక్కడి పరిస్థితుల అధ్యయనం కోసం ఇప్పుడు పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రయాన్​-2ను ప్రయోగిస్తోంది ఇస్రో.

చంద్రయాన్​-1 అక్కడి కక్ష్యలోనే తిరిగి సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. అంతరిక్ష రంగంలో భారత ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో 35 కిలోల ఇంపాక్టర్​ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడవగా... అది జాబిల్లిని బలంగా ఢీకొట్టింది. ఇంపాక్టర్​ బద్దలయ్యేలోపే.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఛాయాచిత్రాలు, సమాచారాన్ని సేకరించి భూమికి చేరవేసింది. దాదాపు 3 వేల సార్లు పరిభ్రమించి.. 70 వేల వరకు ఫొటోలను పంపింది.

10 నెలలకే ముగిసిన ప్రస్థానం..

చిన్న చిన్న ఇబ్బందులతో 2009 ఆగస్టు 29న చంద్రయాన్​-1తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రెండేళ్లు పనిచేసేలా రూపొందించినా 10 నెలలకే ప్రస్థానం ముగిసింది. అయినా.. భారత అంతరిక్ష రంగంలో అదో అద్భుతం.. గొప్ప మైలురాయి... మరిచిపోలేని ఘనత. తొలిసారి.. చందమామపై నీరు, మంచు​ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది చంద్రయాన్​-1.

అమెరికా పంపిన 'మూన్​ మినరాలజీ మ్యాపర్' నీటి జాడను తొలిసారిగా గుర్తించినా... తదనంతరం ఇస్రో దీనిని నిర్ధరించింది.

Last Updated : Jul 21, 2019, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details