విచారణలో ఉన్న వ్యాజ్యాలపై కొన్ని ప్రసార మాధ్యమాలు వ్యాఖ్యలు చేస్తున్నాయని, అవి కోర్టు ధిక్కరణ పరిధిలోకి రావొచ్చని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. సామాజిక ఉద్యమకర్తగా ఉన్న ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, పాత్రికేయుడు తరుణ్ తేజ్‌పాల్‌లపై 2009లో దాఖలైన ధిక్కరణ పిటిషన్ విచారణలో సహకరించడానికి మంగళవారం ఆయన సుప్రీంకోర్టులో జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట హాజరయ్యారు.
కోర్టుల్ని ప్రభావితం చేసేలా...
తేజ్‌పాల్ సంపాదకునిగా ఉన్న 'తహల్కా' మ్యాగజీన్‌కు ఇచ్చిన ముఖాముఖిలో న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వ్యాఖ్యల్ని ప్రశాంత్‌భూషణ్ చేశారనే కేసులో కొన్ని అంశాలను ధర్మాసనానికి తిరిగి నివేదించడానికి ఏజీకి అవకాశం లభించింది. దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన విచారణలో ఆయన వాదనలు వినిపిస్తూ.. కేసులపై పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిషిద్ధమైనవని అన్నారు. కోర్టుల్ని ప్రభావితం చేసేలా మీడియా వ్యాఖ్యలు ఉంటున్నాయని ఆక్షేపించారు.
పెద్దపెద్ద కేసుల్లో కోర్టు ముందుకు బెయిల్ పిటిషన్లు రాబోతుండగానే వాటిని దాఖలు చేసుకున్న నిందితులను దారుణంగా కించపరిచేలా టీవీల్లో వార్తలు వచ్చేస్తున్నాయని చెప్పారు. రఫేల్ కేసులో వార్తల్ని ప్రస్తావిస్తూ.. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. పరిశీలించాల్సిన ఇతర అంశాలను తమ ముందుకు తీసుకురావాలని చెబుతూ తదుపరి విచారణను ధర్మాసనం నవంబరు 4వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:'అర్ధరాత్రి దహనం మానవ హక్కుల ఉల్లంఘనే'