పత్రికలు, మీడియా సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా బకాయి పడ్డాయని సుప్రీంకోర్టుకు భారతీయ వార్తాపత్రికల సంఘం (ఐఎన్ఎస్) నివేదించింది. ప్రభుత్వ ప్రచార విభాగాలు యాడ్లకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్లను చెల్లించలేదని వివరించింది.
ఈ సంక్షోభ సమయంలో పత్రికా యాజమాన్యాలకు ఈ డబ్బులు వస్తాయో లేదోనని సుప్రీంకోర్టు ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది ఐఎన్ఎస్. మీడియా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) అందించిన వివరాలను కోర్టుకు సమర్పించింది. ఎన్బీఏ కూడా వేరుగా మరో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది.
"పరిశ్రమ అంచనాల ప్రకారం.. మీడియా సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైసింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) రూ.1,500 నుంచి రూ.1,800 కోట్లు బకాయి పడింది. ఇందులో రూ.900 కోట్ల వరకు పత్రికా సంస్థలకు చెందినవే. చాలా నెలలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లిస్తుందనే నమ్మకం కూడా లేదు."
- ఐఎన్ఎస్
దేశంలోని మూడు జర్నలిస్టు సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఐఎన్ఎస్, ఎన్బీఏకు నోటీసులు జారీ చేసింది జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. వీటికి స్పందనగా ఎన్బీఏ, ఐఎన్ఎస్ వివరణ ఇచ్చాయి.
"కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వల్ల మీడియా పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది. మీడియా హౌసులన్నీ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ అనుకోని విపత్తు సమయంలోనూ వార్తాసంస్థలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం దక్కలేదు. ఆదుకునేందుకు కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదు."