ఉగ్రవాద బెదిరింపుల కారణంగా జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 40 వేల మంది సర్పంచ్, వార్డ్ మెంబర్లలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షల బీమా రక్షణ కల్పించాలని కేంద్రం పరిశీలిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ చట్టాలు, ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ ప్రజలకు కలగబోయే ప్రయోజనాలపై తక్కువ అవగాహన ఉన్న జమ్ముకశ్మీర్ ప్రజా ప్రతినిధులకు వీటి గురించి తెలియజేయనున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు.
" జమ్ముకశ్మీర్‌లోని సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లలకు 4 లక్షల రూపాయలు బీమా కల్పించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం."
-ఓ కేంద్ర హోంశాఖ అధికారి
ఇటీవలే విజ్ఞప్తి
జమ్ముకశ్మీర్‌లోని సర్పంచ్, వార్డ్ మెంబర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవలే కలిశారు. తమకు ఉగ్రవాద ముప్పు ఉందని ఒక్కొక్కరికి రూ. 2 లక్షల బీమా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిని పరిశీలిస్తోన్న హోంశాఖ... రూ.2 లక్షలకు బదులుగా ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు బీమా కల్పించాలని యోచిస్తోంది. వీటితో పాటు కశ్మీర్‌కు వర్తించే కేంద్ర చట్టాలపై వీరందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖను కోరింది హోంశాఖ.
గతేడాది చివర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా మొత్తం 40 వేల మంది సర్పంచ్,వార్డ్ మెంబర్లు ఎన్నికయ్యారు.