తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలో పార్లమెంటు ప్రత్యేక సమావేశం!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. మరోవైపు కర్షకుల నిరసనలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

Center is planning to hold special parliamentary session on farmer protests
రైతుల దీక్ష: పార్లమెంటు ప్రత్యేక సమావేశం!

By

Published : Dec 6, 2020, 12:58 PM IST

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారీ ఎలాంటి ఫలితం లేకుండా ముగియడం వల్ల అన్నదాతల ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీలో తిష్ఠ వేసిన రైతులు ఆదివారమూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. హరియాణా, పంజాబ్‌వైపు వెళ్లే రహదారుల్ని దిగ్బంధించారు. దీంతో గత పదిరోజులుగా నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యలు నేడూ కొనసాగుతున్నాయి.

రైతులు పట్టువీడకపోవడం వల్ల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రైతుల లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు సుముఖంగా లేదని రైతు సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సవరణలు తేనున్నారు.. చట్టంలోని ఏ సెక్షన్లలో మార్పులు చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. తదుపరి చర్చలు డిసెంబరు 9న జరగనున్నాయి.

రహదారిపై బైఠాయించిన అన్నదాతలు

రైతుల ఆందోళనకు మద్దతు

మరోవైపు రైతుల ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో అన్నదాతలకు సంఘీభావంగా కారు ర్యాలీ నిర్వహించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి హర్‌జోత్‌ సింగ్‌ బెయిన్స్‌ వెల్లడించారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలను ట్విటర్‌లో పంచుకున్నారు.

మహాలో రైతులపై కేసు...

ఇంకోవైపు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు మహారాష్ట్రలోని చెరకు రైతులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఔరంగాబాద్‌లో నిరసన తెలిపారు. వీరిలో 150 మందిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుమికూడదన్న నిబంధనలు ఉన్నాయని.. రైతులు వీటిని ఉల్లంఘించినందునే కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఒడిశాలోనూ రైతులు కేంద్రీకృత పంట సేకరణ విధానానికి వ్యతిరేకంగా అనేక పట్టణాల్లో మార్కెట్‌ యార్డుల వద్ద నిరసన చేపట్టారు.

ఇదీ చూడండి:సింఘు సరిహద్దులో రైతు సంఘాల నేతల భేటీ

ABOUT THE AUTHOR

...view details