తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాఫీడే సిద్ధార్థ అదృశ్యం- ఆర్థిక ఇబ్బందులే కారణం! - సిద్ధార్థ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం సాయంత్రం సకలేశ్​పుర్​కు బయల్దేరిన సిద్ధార్థ... మధ్యలో మంగళూరు వైపు మళ్లారు. నేత్రావతి నది వంతెనపై వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లి, అదృశ్యమయ్యారు.

కాఫీడే సిద్ధార్థ అదృశ్యం- ఆర్థిక ఇబ్బందులే కారణం!

By

Published : Jul 30, 2019, 11:09 AM IST

Updated : Jul 30, 2019, 2:07 PM IST

కేఫ్ కాఫీ డే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారు. సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్​పుర్ బయలుదేరిన ఆయన... కాసేపటి తర్వాత మంగళూరు వైపు వెళ్లాలని వాహన డ్రైవర్​కు సూచించారని సమాచారం.

"దక్షిణ కన్నడ జిల్లా కోటెపుర ప్రాంతంలో నేత్రావది నది వంతెనపై ప్రయాణిస్తున్న సమయంలో కారు నిలిపివేయాలని ఆదేశించారు సిద్ధార్థ. కాసేపు ఒంటరిగా నడవాలనుకుంటున్నట్లు డ్రైవర్​కు చెప్పారు. వంతెనపై నడుస్తూ సోమవారం సాయంత్రం 6.30 గంటల వరకు సిద్ధార్థ చరవాణిలో సంభాషించారు. కొద్దిసేపటి అనంతరం ఆయన కనిపించకుండాపోయారని డ్రైవర్ చెప్పాడు. రెండు గంటలైనా సిద్ధార్థ తిరిగి రాకపోయేసరికి పోలీసులకు డ్రైవర్​ ఫిర్యాదు చేశాడు" అని వెల్లడించారు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ సెంథిల్ శశికాంత్.

సిద్ధార్థ కోసం నేత్రావతి నదిలో నౌకదళానికి చెందిన ఓడ, హెలికాప్టర్‌, 300 మంది గజ ఈతగాళ్ల సాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సిద్ధార్థ లేఖ విడుదల

కాఫీ డే ఉద్యోగులు, డైరెక్టర్లకు సిద్ధార్థ రాసిన లేఖ తాజాగా బయటపడింది.

"ప్రతి ఆర్థిక లావాదేవీకి నాదే బాధ్యత. ఎవరినీ మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యాపారవేత్తగా నేను విఫలం అయ్యాను. నన్ను అర్థం చేసుకుని, మన్నిస్తారని ఆశిస్తున్నా. ఈ లేఖతో పాటు నా ఆస్తుల వివరాలతో కూడిన ఓ పత్రాన్ని పొందుపరుస్తున్నాను. నా ఆస్తుల విలువ అప్పులకన్నా ఎక్కువే ఉంది. రుణదాతలు అందరికీ తిరిగి చెల్లించేందుకు వీలు ఉంటుంది" అని సిద్ధార్థ లేఖలో పేర్కొన్నారు.

ఎస్​ఎం కృష్ణతో నేతల భేటీ

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప... ఎస్​ఎం కృష్ణ నివాసానికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. అక్కడి నుంచే గాలింపు చర్యలపై సమీక్షిస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఎస్​ఎంతో భేటీ అయ్యారు.

అమిత్​షాకు కర్ణాటక నేతల వినతి

కేఫ్​ కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆచూకీని కనుగొనడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హోంమంత్రి అమిత్​షా కు భాజపా కర్ణాటక ఎంపీ శోభా కరంద్లాజే వినతి పత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి: వైరల్: జనాలపైకి దూసుకెళ్లిన కారు

Last Updated : Jul 30, 2019, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details