చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరించింది. 18 లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా లక్షమందికిపైగా మృతి చెందారు. భారత్ లోనూ నానాటికీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 9 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 3 రాష్ట్రాలకు మాత్రం ఈ మహమ్మారి వ్యాప్తి చెందలేదు. మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నాగాలాండ్‌లో ఈరోజే తొలి కేసు వెలుగు చూసింది. ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు. అందులోనూ ప్రముఖ పర్యటక ప్రాంతాలు కావటం విశేషం. వీటితో పాటు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
పౌర నిరసనలు..
కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడానికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 డిసెంబర్ 11న అమల్లోకి వచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) పార్లమెంటులో ఉండగానే.. 2019 అక్టోబర్‌లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
ఆంక్షల విధింపు..
సీఏబీకి పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారినప్పటినుంచి ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా మంది పర్యటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.