గత నెల చివరి రోజు (అక్టోబర్ 31)న షేర్ మార్కెట్ల సూచీలు భారీ స్థాయిలో 40,392 పాయింట్ల స్థాయిని చేరడంతో అందరూ సంబరాలు చేసుకున్నారు. అది మదుపరులకు ఆనందకర క్షణం. ప్రసార మాధ్యమాలూ ఉత్సాహంగా స్పందించాయి. అయితే, మార్కెట్ ర్యాలీ సంబరాల్లో పడి, ప్రధాన స్రవంతి మీడియా ఓ ముఖ్యమైన అంశాన్ని మరచింది. 2019 అక్టోబర్ 30న భారత్‌లోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ ఓ నివేదిక విడుదల చేసింది.
దేశంలోని 13 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఆ నివేదిక రూపొందింది. దేశంలో ఆహార పదార్థాల ధరలు తక్కువగా ఉండటం వల్ల వ్యవసాయ ఆదాయంలో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడినట్లు వెల్లడైంది. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్న లక్ష్యాన్ని దెబ్బతీసే అవకాశాన్ని సూచించింది. ఆ నివేదిక విడుదలకు కొన్ని రోజుల ముందు దేశంలో వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) మార్కెట్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మందగించినట్లు గుర్తించారు. ఏడాది క్రితం 16 శాతంవరకు ఉన్న గ్రామీణ భారతంలోని వృద్ధి రెండు శాతానికి పడిపోయింది.
పట్టణ వృద్ధితో పోలిస్తే- ఎఫ్‌ఎంసీజీ గ్రామీణ వృద్ధి క్షీణించడం ఏడేళ్లలో ఇదే తొలిసారి. ఈ అంశాలను నిశితంగా పరిశీలిస్తే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విధానపరమైన అంతరార్థాలు, తాజా పరిస్థితులు మరింత లోతుగా అర్థమవుతాయి. ఇందులో గ్రామీణ ఆదాయాలపై హెచ్చరిక ఉంది. డిమాండ్ క్షీణించిన సంగతీ తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడల్లా గ్రామీణ భారతం అధిక వ్యయాల ద్వారా పునరుద్ధరణకు సహాయపడుతూ ఉంటుంది. వాస్తవానికి, గత పదేళ్లలో రోజువారీ అవసరాల్లో భాగంగా వినియోగించే వస్తువుల బ్రాండ్ల అమ్మకాలు బాగా పెరిగాయి. గ్రామీణ భారత్‌లో 80 కోట్ల జనాభా ఉండగా, దేశంలోని ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 36 శాతం అక్కడే జరుగుతాయి. ఇది గ్రామీణ డిమాండ్‌కున్న ప్రాధాన్యాన్ని, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రను తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో గ్రామీణ వృద్ధికి సంబంధించిన గమనాన్ని అర్థం చేసుకోవడం అవసరం. గ్రామీణ వృద్ధి క్షీణించడం వెనకున్న కారణాల్నీ అవగతం చేసుకోవాలి. మార్గాంతరాల్ని అన్వేషించాలి.
క్షీణతకు కారణాలెన్నో...
భారత్‌లో గ్రామీణ వృద్ధి మందగించడానికి పలు కారణాలు తోడయ్యాయి. అవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అన్నింటికన్నా ముందు వాస్తవిక గ్రామీణ వేతన వృద్ధిలో తగ్గుదల నమోదైంది. దీనికి తోడు కొన్నేళ్లుగా గ్రామీణ ఆదాయాల్లో పెరుగుదల నిలిచిపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, వర్షాలు సక్రమరీతిలో పడకపోవడం వంటివి పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఇవి గ్రామీణ ఆదాయాల క్షీణతకు దారితీశాయి. ఆదాయాల్లో కుంగుదల ఉంటే, వినియోగం తగ్గుతుంది. ఫలితంగా డిమాండ్ సైతం కోసుకుపోతుంది.
పల్లెప్రాంతాల్లో వ్యాపారులు, వ్యవసాయదారులకు నగదు లభ్యత కొరత ఎదురైంది. పరిస్థితులకు తగినట్లుగా రిజర్వు బ్యాంకు పాలసీ రేట్లను తగ్గించినా, తక్కువ వడ్డీరేట్ల ప్రయోజనాన్ని బ్యాంకులు ప్రజలకు చేరవేయలేదు. ఇది వృద్ధి అవకాశాల్ని బాగా దెబ్బతీసింది. దేశంలో గత రెండేళ్లలో అత్యంత తక్కువ రుణ వృద్ధి 8.8 శాతం నమోదుకావడమే ఇందుకు దృష్టాంతం. గ్రామీణ ప్రాంతాలు, అసంఘటిత రంగాలకు రుణ పంపిణీ విషయంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లు మరీ జాగ్రత్తగా వ్యవహరించాయి. ముఖ్యంగా ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌ఎఫ్‌ఎస్)’ సంస్థ పతనం తరవాత ఈ విషయంలో మరింత జాగ్రత్తపడ్డాయి.
ఈ పరిణామాలతో రైతులకు, సంస్థలకు, వ్యాపారులకు నగదు కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాలకన్నా గ్రామీణ ప్రాంతాలే ఎక్కువగా ప్రభావితమవుతాయి. పట్టణ మార్కెట్లకు బహుళ మార్గాల్లో నిధులు అందే అవకాశం ఉంటుంది. గ్రామీణ మార్కెట్లకు నిధుల అందుబాటు తక్కువ. ఇది గ్రామీణ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు గిరాకీని సైతం తగ్గిస్తుంది. ఫలితంగా, గత ఏడేళ్ల కాలంలో పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ మార్కెట్ల విస్తరణ, వృద్ధి తక్కువగా నమోదయ్యాయి.
గ్రామీణ వృద్ధికి సంబంధించిన ఇబ్బందులకు తరుణోపాయం వ్యవసాయ సమస్యల పరిష్కరణే. దేశంలో 61 శాతం గ్రామీణ జనాభాయే కావడం, సుమారు 50 శాతం శ్రామికశక్తి- వ్యవసాయం తదితర కార్యకలాపాలపైనే ఆధారపడటం వంటి అంశాల కారణంగా గ్రామీణ వృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం వ్యవసాయం చుట్టూనే తిరుగుతుంది. గ్రామీణ వృద్ధిని పునరుద్ధరించేందుకు సరఫరా, గిరాకీ- రెండువైపులా దృష్టి సారించాలి.
సరఫరా వైపు చూస్తే- ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరతను తీర్చేందుకు బ్యాంకులను ఒప్పించి, తక్కువ వడ్డీరేట్లతో కలిగే ప్రయోజనాలను వ్యాపారులు, వ్యవసాయదారులకు బదిలీ జరిగేలా చూడాలి. ఇది సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు, నిధుల కొరత వల్ల ఏర్పడిన ఇబ్బందుల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. గిరాకీపరంగా- ముందు గ్రామీణ డిమాండ్‌లో క్షీణతను అడ్డుకోవడానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి. ఆపై పరిస్థితిని మరింతగా మెరుగుపరచేందుకు కృషి చేయాలి. ఎప్పుడైనా- డిమాండ్ పునరుద్ధరణ అనేసరికి ఓ సర్వసాధారణ పరిష్కారం స్ఫురిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యయం పెంచాలనే ఈ పరిష్కార మార్గాన్ని అభివృద్ధి ఆర్థికవేత్తలు సూచిస్తుంటారు.