బాంబు దాడి వల్ల భయాందోళనలో స్థానికులు పశ్చిమబెంగాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంకినార ప్రాంతంలో బాంబు దాడి జరిగింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబు విసిరి పారిపోయారని స్థానికులు తెలిపారు. బాంబు దాడి ఘటనలతో నిత్యం భయంతో జీవిస్తున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
"రోజూ ఉదయం 6 గంటలకు నిద్రపోతున్నాం. 10 గంటలకే లేస్తున్నాం. భయపడుతూనే అన్ని పనులు చేస్తున్నాం. భయంతో ఎవరు రాత్రిపూట నిద్రపోవడం లేదు. ఇక్కడ ఎవరిని ఏ ప్రశ్న అడిగినా... జవాబు చెప్పరు. ఏదైనా మాట్లాడితే వారినీ చంపేస్తారని భయం. ఇదీ ఇక్కడి పరిస్థితి. ఇళ్లు మూసే ఉంటాయి. తలుపు, కిటికీలు చెక్కతో చేసినవి. వాళ్లు(దుండగులు) వచ్చి రాత్రి పెట్రోల్ పోసి మంట పెట్టి వెళ్లిపోతున్నారు."
--- అనీశ్, స్థానికుడు.
పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి అల్లర్లు, ఘర్షణతో ఆ రాష్ట్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజులుగా కంకినార ప్రాంతంలో దోపీడులూ జరుగుతున్నాయని... తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'వాయు' వేగంతో దూసుకొస్తోన్న తీవ్ర తుపాను