మంగళూరు బాంబు ఘటన దర్యాప్తులో సరికొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం విమనాశ్రయంలో కలకలం రేపిన బ్యాగు కాకుండా.. అనుమానితుడి వద్ద రెండో బ్యాగు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఆ బ్యాగులో ఏముంది?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బస్‌స్టాండ్ వద్ద బస్సు ఎక్కే సమయంలో అనుమానితుడి వద్ద రెండు బ్యాగులున్నాయి. అనంతరం అతడు కెన్జార్ విమానాశ్రయం స్టాప్ వద్ద బస్సు దిగాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న సెలూన్‌లోకి వెళ్లాడు. కొంతసేపు తన బ్యాగు అక్కడ పెడతానని కోరగా.. సెలూన్ సిబ్బంది బయట పెట్టమని చెప్పారు.
సెలూన్ నుంచి ఓ ఆటోలో ఐఈడీ ఉన్న మరో బ్యాగుతో విమానాశ్రయానికి బయలుదేరాడు అనుమానితుడు. ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగును వదిలేసిన వెంటనే అదే ఆటోలో సెలూన్‌కు తిరిగివెళ్లాడు. రెండో బ్యాగు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడు, రెండో బ్యాగును ఏం చేశాడు, అందులో ఏం ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.
ఎందుకీ పని...?
అనుమానితుడికి.. అసలు విమానాశ్రయంలో బాంబు పేల్చే ఉద్దేశం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయంలో ఐఈడీ ఉన్న బ్యాగును వదిలినప్పటికీ.. దాని కనెక్షన్ సరిగ్గా లేదు. పైగా టైమర్ కూడా ఆన్ చేసి లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే అతడు ఈ పని చేసి ఉండొచ్చని.. లేదా పట్టుబడతాననే భయంతోనే అక్కడి నుంచి హడావుడిగా జారుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.