ఈ జూన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మోదీ 2.0 వార్షికోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది భాజపా. నెల రోజుపాటు డిజిటల్ ర్యాలీలతో సామాజిక మాధ్యమాలను హోరెత్తించనుంది.
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భాజపా శ్రేణులు డిజిటల్ ర్యాలీలు నిర్వహిస్తాయని పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కమలం పార్టీ కార్యకర్తలు ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. ఆకలితో ఉన్న వారికి 19 కోట్ల ఆహార పొట్లాలను అందజేశారని, 4 కోట్లకుపైగా రేషన్ ప్యాకెట్లను పంపిణీ చేశారని వివరించారు.
ఆహారం, రేషన్ మాత్రమే కాకుండా 5 కోట్ల మాస్కులను భాజపా కార్యకర్తలు ప్రజలకు పంపిణీ చేశారని, ఆరోగ్య సేతు యాప్‌పై అవగాహన కల్పించి పీఎం కేర్స్‌కు విరాళాలు సమకూర్చేందుకు శ్రమించారని భూపేంద్ర అన్నారు. మోదీ 2.0 వార్షికోత్సవం సందర్భంగా భాజపా ఏడు శాఖలు 500 డిజిటల్ ర్యాలీలను నిర్వహిస్తాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫేస్బుక్ లైవ్‌లో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
'స్వావలంబన భారత్' పేరుతో ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి మోదీ రాసిన లేఖను ప్రజలకు భాజపా చేరవేస్తుందని భూపేంద్ర పేర్కొన్నారు. 10 కోట్ల కుటుంబాలకు ఈ లేఖను పంపిణీ చేస్తామన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ.. భాజపా సన్నద్ధమవుతుందని, నూతన సాంకేతికతతో ప్రజలకు చేరువయ్యేలా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు భూపేంద్ర యాదవ్.