తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుమిత్రా మహాజన్​కు భాజపా సీటిస్తుందా? - మురళీ మనోహర్ జోషి

మధ్యప్రదేశ్​ ప్రజలు అభిమానంతో 'తాయ్​' (పెద్దక్క) గా పిలుచుకునే సుమిత్రా మహాజన్​కు భాజపా ఈ సారి లోక్​సభ టికెట్​ ఇస్తుందా? ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండోర్​ లోక్​సభ స్థానాన్ని ఆమెకు ఇంకా కేటాయించకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది.

సుమిత్రా మహాజన్​కు భాజపా సీటిస్తుందా?

By

Published : Mar 29, 2019, 11:32 PM IST

సుమిత్రా మహాజన్​కు భాజపా సీటిస్తుందా?

భాజపా మరో అగ్రనేతకు ఉద్వాసన పలకనుందా? సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నేతలను పక్కపెట్టిన భాజపా సుమిత్రా మహాజన్​కు టికెట్​ నిరాకరించనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మధ్యప్రదేశ్​లోని ఇండోర్ లోక్​స్థానం నుంచి​ ఎంపీగా ఉన్నారు సుమిత్రా మహాజన్​. అయితే సార్వత్రిక ఎన్నికల కోసం ఆ స్థానానికి ఇంకా ఆమె పేరును ఖరారు చేయలేదు భాజపా. దీంతో ఆమెకు ఈసారి సీటు కేటాయిస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది. లోక్​సభ స్పీకర్​గానూ విధులు నిర్వర్తిస్తున్నారుసుమిత్ర.

మధ్యప్రదేశ్​లోని 29 లోక్​సభ స్థానాలకు గాను భాజపా 18 స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించింది. తాజాగా ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ప్రకటించింది. వీటిలో మహాజన్​ పేరు లేదు.

వయస్సు మళ్లిన వారికి నిరాకరణ!

75 సంవత్సరాలు దాటిన వారు ఎన్నికల్లో పాల్గొనకూడదని భాజపాలో ఓ నిర్ణయం అమలువుతోంది. ఈ నిబంధనను అనుసరించే... పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్​కృష్ణ ఆడ్వాణీ, మరో సీనియర్​ నేత మురళీ మనోహర్​ జోషికి ఈ లోక్​సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు.

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్​, మాజీ కేంద్రమంత్రి సర్తాజ్​సింగ్​లకు వయస్సు 75 ఏళ్లు దాటిన కారణంగా భాజపా అవకాశం కల్పించలేదు.

సుమిత్రా రాజకీయ శకం ముగిసిపోతుందా?

మధ్యప్రదేశ్​లో సుమిత్రా మహాజన్​ను 'తాయ్​' ( పెద్ద అక్క) అని సంబోధిస్తారు. ఇప్పుడు ఆమె​ 75వ యేట అడుగుపెట్టారు. కనుక ఆమెకు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని భాజపా అధినాయకత్వం కల్పించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

"ఇదీ పార్టీ అంతర్గత విషయం. బయట మాట్లాడేది కాదు. పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. నేను 'అవును' అని కానీ 'కాదు' అని కానీ చెప్పలేదు. ఇప్పటి వరకు నాతో ఎవరూ ఈ విషయం గురించి చర్చించలేదు. కనుక నేను మీతో ఏమీ చెప్పలేను. నేను పార్టీలో సీనియర్​ కార్యకర్తను. ఇప్పుడు నేను బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉన్నాను. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం కోసం కృషి చేస్తాను. "- సుమిత్రా మహాజన్​, లోక్​సభ స్పీకర్, ఇండోర్​ ఎంపీ

మరో అవకాశం ఉండకపోవచ్చు..

మరోవైపు సుమిత్రా మహాజన్​కు ఈ ఎన్నికల్లో భాజపా తరుపున పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని ఆ పార్టీ (భాజపా) కీలక నేత వ్యాఖ్యానించారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో సుమిత్రా మహాజన్ ఇండోర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ పాటిల్​పై 4,66,901 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ABOUT THE AUTHOR

...view details