తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా-శివసేన మధ్య 'మహా' తూటాలు

భాజపా శివసేన మధ్య మాటల యుద్ధం తరస్థాయికి చేరింది. తాము తలుచుకుంటే భాజపా అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు. మరోవైపు ప్రస్తుత శాసనసభ గడువు పూర్తి కావడం వల్ల సీఎం పదవికి రాజీనామా చేశారు దేవేంద్ర ఫడణవీస్​. రాష్ట్రంలోని పరిస్థితులకు శివసేననే కారణమని ఆరోపించారు. సీఎం పదవి పంచుకోవాలనే విషయంపై ఎప్పుడూ ఒప్పందం జరగలేదని తెలిపారు.

మహా ప్రతిష్టంభన: భాజపా-శివసేన మధ్య మాటల యుద్ధం

By

Published : Nov 8, 2019, 8:44 PM IST

Updated : Nov 8, 2019, 10:53 PM IST

భాజపా-శివసేన మధ్య 'మహా' తూటాలు

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. రేపటితో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తున్నా.. కొత్త ప్రభుత్వంపై ఇంకా స్పష్టత రావడం లేదు. సీఎం పదవీకాలాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలనే విషయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తేల్చి చెప్పారు. భాజపాతో చర్చలు నిలిపివేయడానికి ఆ పార్టీనేతలు చెబుతున్న అబద్ధాలే కారణమని విమర్శించారు. మరోవైపు 50:50 ఫార్ములాపై శివసేనతో అసలు ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

భాజపాపై ఠాక్రే నిప్పులు

ఫడణవీస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..భాజపాపై నిప్పులు చెరిగారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే. గంగా నది ప్రక్షాళన చేస్తూ ఆ పార్టీ నేతల ఆలోచనలు కలుషితమయ్యాయని ధ్వజమెత్తారు. కూటమి ఏర్పాటు కోసం సరైన వ్యక్తులను ఎంచుకోకపోవడం ఎంతో బాధగా ఉందని వ్యాఖ్యానించారు. చర్చలకు ద్వారాలు తాము మూసివేయలేదని..భాజపా నేతలు అబద్ధాల వల్లే వారితో సంప్రదింపులు జరపడం లేదని స్పష్టం చేశారు ఠాక్రే. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీతో శివసేన సంప్రదింపులు జరపలేదన్నారు. సీఎం పదవీకాలం చెరిసగం(50:50 ఫార్ములా)పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

తండ్రికిచ్చిన మాట..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఏదో ఒక రోజు శివసేన చేపడుతుందని తన తండ్రి బాల్ ఠాక్రేకు చెప్పినట్టు గుర్తుచేసిన ఉద్ధవ్​... ఇచ్చిన మాటను నిజం చేస్తానని పునరుద్ఘాటించారు. ఇందుకు అమిత్​ షా, ఫడణవీస్​ల మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు.

ఫడణవీస్ రాజీనామా

అంతకుముందు.. మహారాష్ట్ర సీఎం పదవికి ఫడణవీస్‌ రాజీనామా చేశారు . ప్రస్తుత శాసనసభ గడువు ముగియడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామాను అంగీకరించిన గవర్నర్​... మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ తనను​ సూచించినట్లు చెప్పారు ఫడణవీస్​.

'ఠాక్రే నుంచి స్పందన లేదు'

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు విఫలం కావడానికి 100శాతం శివసేననే కారణమన్నారు ఫడణవీస్​. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. భాజపా-శివసేన కూటమి ఇంకా విడిపోలేదన్నారు. ఈ విషయంపై ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో శివసేన ఇంకా భాగస్వామిగానే ఉందని గుర్తు చేశారు ఫడణవీస్.

మహారాష్ట్ర సీఎం పదవీకాలాన్ని చెరి రెండున్నరేళ్లు( 50:50 ఫార్ములా) భాజపా-శివసేన పంచుకోవాలనే విషయంపై ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఫడణవీస్. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విషయాన్నే చెప్పినట్టు పేర్కొన్నారు.

భాజపా-శివసేన కలవాలి..

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా సమయముందన్నారు భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. ప్రజల సంక్షేమం కోసం భాజపా-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పదవీకాలం చెరిసగం అంశంపై స్పందిస్తూ...అలాంటి హామీ అమిత్​ షా ఇవ్వలేదన్నారు గడ్కరీ.

ఇదీ చూడండి: 'భద్రత' రగడ: మోదీ, షాపై కాంగ్రెస్​ ఆగ్రహం

Last Updated : Nov 8, 2019, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details