'మోదీ చొరబాటుదారు' వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు చొరబాటుదారులంటూ కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. అధీర్ రంజన్ వ్యాఖ్యలను ఖండించిన భాజపా ఎంపీలు.. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గందరగోళం మధ్య తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అధీర్ రంజన్. ఈ సందర్భంగా ఎన్ఆర్సీపై వ్యతిరేకతను మరోసారి బయటపెట్టారు.
"నేను, మా తల్లిదండ్రులు బంగ్లాదేశ్‌లో ఉండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక మాకు ఎలాంటి పత్రాలు లేవు. కానీ స్వాతంత్ర్య పోరాటం నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇదే మా దేశం. కానీ పత్రాలు కావాలనడంలో నాకు ఎలాంటి అర్థం కనపడటం లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా చొరబాటుదారు అంటే.. నేను చొరబాటుదారుడిని అయిపోతాను. ఏం చేయమంటారు?"
--- అధీర్ రంజన్, కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత.
మోదీ, షాలపై చేసిన వ్యాఖ్యలకు అధీర్ రంజన్ వివరణ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఆయన క్షమాపణలకు పట్టుబట్టారు భాజపా ఎంపీలు. బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం దక్కేందుకు కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత సహాయం చేస్తున్నారని ఆరోపించారు. భాజపా నేతలు గందరగోళం సృష్టించడం వల్ల లోక్‌సభ ఒకసారి వాయిదా పడింది.
సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. భాజపా సభ్యులు నిరసన చేపట్టారు. రంజన్ క్షమాపణలకు పట్టుబట్టారు.
'సోనియానే చొరబాటుదారు'
చౌదరి వ్యాఖ్యలపై మండిపడ్డ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. అయన సొంత పార్టీ అధ్యక్షురాలే (సోనియా గాంధీ) చొరబాటుదారు అని ఆరోపించారు.
"ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలను చొరబాటుదారులంటూ అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ్యతారహితమైనవి, ఖండించాల్సినవి, దేశ ప్రజలు ఈ వ్యాఖ్యలను ఆమోదించరు. ఓ కాంగ్రెస్‌యేతర నేతకు రెండోసారి భారీ మెజారిటీతో ప్రజలు ప్రధాని బాధ్యతలు అప్పగించారంటే అది మోదీకే సాధ్యమైంది. అందరూ ఇష్టపడే అలాంటి వ్యక్తిని ఈయన(రంజన్) చొరబాటుదారు అన్నారు. ఈయన పార్టీ నేతే ఓ చొరబాటుదారు. ఆ విషయం ఈయనకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చొరబాటుదారు. కానీ ఈయనేమో మా నేత నరేంద్ర మోదీ చొరబాటుదారు అంటున్నారు. మోదీ సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. అలాంటిది రంజన్.. మోదీ, షాలను చొరబాటుదారు అంటున్నారు. దీనిని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి కొంచమైనా బుద్ధి ఉంటే.. అధీర్ రంజన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి."
--- ప్రహ్లాద్ జోషి, కేంద్రమంత్రి.
చివరికి దేశ ప్రజల శ్రేయస్సే ప్రధానమని... తమ మధ్య ఉన్న వివాదాన్ని పక్కన పెట్టి ఇతర అంశాలపై చర్చలు జరిపారు దిగువ సభ ఎంపీలు.
ఆదివారం చేసిన వ్యాఖ్యలు
దిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు చొరబాటుదారులని వ్యాఖ్యానించారు రంజన్.
ఇదీ చూడండి- దిశ: లోక్‌సభలోనూ ఎంపీల 'ఉరిశిక్ష' డిమాండ్