వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కమలదళానికి నూతన జాతీయ అధ్యక్షుడు రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు పార్టీ నూతన అధ్యక్షులు కూడా నియమితులు కానున్నారని తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికల ద్వారా వీరి నియామకాలు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు ఒకరు తెలిపారు.
ఫిబ్రవరి ద్వితీయార్ధంలో
బిహార్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల భాజపా అధ్యక్షులను ఇటీవలే నియమించినందున వారిని మార్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. హిందువుల పవిత్రకాలమైన ఉత్తరాయణం జనవరి 15న మొదలుకానుంది. ఈ సందర్భంగా మిగతా రాష్ట్రాలకు నూతన అధ్యక్షుల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.
కొత్త జాతీయాధ్యక్షుడు ఎన్నికయ్యే సరికి దేశవ్యాప్తంగా సగం రాష్ట్రాలకైనా అధ్యక్షులను నియమించాలని భావిస్తోంది కాషాయ పార్టీ. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో భాజపా జాతీయ మండలి సమావేశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఎన్నిక ద్వారా లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డు అప్పటికే సూచించిన వ్యక్తి కొత్త జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
నడ్డాకు మార్గం సుగమం..!
ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన అనంతరం.. మోదీ కేబినెట్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుత భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా. అనంతరం జేపీ నడ్డాను భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. అయితే 'ఒకరికి ఒకే పదవి' అన్న భాజపా సూత్రం ప్రకారం తదుపరి కమలదళం బాస్‌గా జేపీ నడ్డా ఎన్నిక లాంఛనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.