కర్ణాటకీయం: మరోసారి తెరపైకి రిసార్ట్ రాజకీయం నిమిష నిమిషానికి శర వేగంగా మారుతోన్న కర్ణాటక రాజకీయాలు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్యే ల రాజీనామాలు...బుజ్జగింపులు...చర్చోపచర్చలు...కీలక నేతల భేటీలు...ఇవ్వన్నీ కన్నడ రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం కుమార స్వామి విధానసభ సాక్షిగా చేసిన ప్రకటన... భాజపాను ఆత్మ రక్షణ ధోరణిలో పడేసింది.
కొంత మంది భాజపా ఎమ్మెల్యేలతో సీఎం కుమార్ స్వామి అందుబాటులోకి వెళ్లారన్న సమాచారం కమల దళాన్ని కూడా రిసార్ట్ బాట పట్టించింది. విశ్వాస పరీక్ష పెట్టేంత వరకు బెంగళూరుకి సుదూరంగా ఉండే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలని సంరక్షించాలంటూ భాజపా అధినాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇందుకు సంబంధించి నగర శివారులోని యెలహంకలోని రమాదా, సాయి లీలా రిసార్ట్‌లలో తమ పార్టీకి చెందిన సుమారు 100 మంది ఎమ్మెల్యే లను ఉంచిన భాజపా..రిసార్ట్ ల చుట్టూ పక్కల పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయించింది.
కాంగ్రెస్ రాజకీయం...
మరో వైపు కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ పుర్లోని తాజ్ వెస్ట్ ఎండ్ లో తమ ఎమ్మెల్యేలు ఉండేందుకు ఏర్పాట్లు చేయగా..అక్కడి నుంచి మరో చోటికి తమ పార్టీ శాసన సభ్యులను తరలించాలని ఆలోచనలో ఉంది. ఇంకో వైపు జేడీఎస్.. దేవనహళ్లి లోని గోల్ఫ్ షైర్ రిసార్ట్ లో తమ పార్టీ కి చెందిన 30 మంది ఎమ్మెల్యేల ను ఉంచింది. ఇలా కీలక పార్టీలు మూడూ.. రిసార్ట్ రాజకీయాలకు తెర లేపాయి.
అనూహ్య ప్రకటన...
శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ లో సీఎం కుమార స్వామి చేసిన ప్రకటన...ఈ రిసార్ట్ రాజకీయాలకు దారి తీసింది. స్పీకర్ అనుమతి ఇస్తే ఈ సెషన్ లోనే తమ బలాన్ని నిరూపించుకుంటామని సీఎం కుమార స్వామి ప్రకటించారు. ఒక్కసారిగా భాజపా అయోమయంలో పడింది. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెనక్కి రప్పిస్తామంటూ కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ లభించడం వల్లే సీఎం కుమార స్వామి నేరుగా తన నిర్ణయాన్ని స్పీకర్ ముందు ఉంచారు.
అయితే సభ మొదటి రోజు సంతాప తీర్మానాలు ఉన్న పక్షంలో సమయం ఇచ్చేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ కోరిన పక్షం లో ఏ క్షణాన్నైనా విశ్వాస పరీక్షకు కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సిద్ధమని కుమార స్వామి ధీమా వ్యక్తం చేయడం... ప్రతిపక్ష భాజపాకు అయోమయ పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరిలించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అంగీకరించారు.
"మా ఎమ్మెల్యేలందరూ కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం అందరూ కలిసి విధానసభకు హాజరవుతారు. భయమనే ప్రశ్నే లేదు. వాళ్లు (ఎమ్మెల్యేలు) నిర్ణయించుకున్నారు.. ఈ రెండు రోజులు కలిసే ఉంటామని.. సోమవారం 10.30కి కలిసి వద్దామనుకుంటున్నారు. కుమారస్వామి సవాలుపై నేను స్పందించదలచుకోలేదు." - బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు
తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కుమార స్వామి టచ్‌లో ఉన్నారన్న సమాచారం అందుకున్న భాజపా...ఎమ్మెల్యే లను రక్షించుకునే పనిలో పడింది.
సుప్రీం ఆదేశం...
ఇదిలా ఉండగా. ...ఇప్పటికే ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించిన అయిదుగురిలో ముగ్గురికి స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వగా....స్పీకర్ తరపున సుప్రీం కోర్టు లో దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం...మంగళవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని స్పీకర్‌ను ఆదేశించింది.
కర్ణాటక శాసనసభ సోమవారానికి వాయిదా పడగా...ఇలా రిసార్ట్ రాజకీయాలు..కీలక నేతల భేటీలతో కర్ణాటక రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతూ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది