తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యడ్డీ సర్కార్'​ ప్రభావం: 'టిప్పు' జయంతి వేడుకలు రద్దు - యడియూరప్ప

కర్ణాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన యడియూరప్ప సర్కార్​ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్దపు మైసూరు చక్రవర్తి టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య. భాజపా లౌకికవాదానికి, మైనార్టీలకు వ్యతిరేకమని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

'యడ్డీ సర్కార్'​ ప్రభావం: 'టిప్పు' జయంతి వేడుకలు రద్దు

By

Published : Jul 30, 2019, 6:12 PM IST

కన్నడ నాట నూతనంగా అధికారం చేపట్టిన భాజపా సర్కారు.. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విశ్వాస పరీక్షలో నెగ్గి.. అధికారంలోకి వచ్చిన 3 రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది యడియూరప్ప ప్రభుత్వం.

2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ వస్తోంది. తొలుత అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఈ పద్ధతిని తీసుకొచ్చారు. అనంతరం.. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వమూ కొనసాగించింది.

'కొడగు'లో అల్లర్లు...

విరాజ్​పేట్​ ఎమ్మెల్యే కె.జి. బోపయ్య అభ్యర్థన మేరకు భాజపా సర్కార్​ ఈ వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొడగు జిల్లాలో ఈ జయంతి ఉత్సవాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున రద్దు చేయాలని సీఎం యడియూరప్పకు లేఖలో తెలిపారు బోపయ్య.

తొలిసారి వేడుకలు నిర్వహించిన 2015లో ఆందోళనలు, అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలోనే వీహెచ్​పీ కార్యకర్త కుత్తప్ప ప్రాణాలు కోల్పోయారు.
ఒక మతం పట్ల పక్షపాతంగా వ్యవహరించేవారనే కారణంతో.. టిప్పు సుల్తాన్ ఉత్సవాలను మొదటి నుంచీ భాజపా సహా మితవాద సంస్థలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.

ఖండించిన సిద్ధరామయ్య..

భాజపా చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య. భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు వ్యతిరేకమని.. అందుకే టిప్పు జయంతి వేడుకలను రద్దు చేసిందని ఆరోపించారు.

భాజపా చర్యను తీవ్రంగా ఖండించిన సిద్ధరామయ్య

''టిప్పు జయంతి వేడుకలను నేనే ప్రారంభించా. వరుసగా 3 సంవత్సరాలు నిర్వహించాం. కర్ణాటక ప్రజలూ అంగీకరించారు. టిప్పు సుల్తాన్​.. బ్రిటీష్​ ప్రజలకు, బ్రిటీష్​ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. నా దృష్టిలో దేశంలోని తొలి స్వాతంత్ర్య సమరయోధుడు టిప్పు. ఈ కారణంగానే.. మేం జయంతి ఉత్సవాలు ప్రారంభించాం. టిప్పు మైనార్టీకి చెందిన వ్యక్తి. దేశంలోని మైనార్టీలకు భాజపా వ్యతిరేకం. కాషాయ పార్టీ ప్రజలూ లౌకిక వాదులు కాదు. వారి భావజాలమూ లౌకిక వాదానికి వ్యతిరేకం. ఈ చర్యను నేను పూర్తిగా ఖండిస్తున్నా.''

- సిద్ధరామయ్య​, కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత

తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప. టిప్పు జయంతి ఉత్సవాల రద్దుకు కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని.. గత అల్లర్లను దృష్టిలో ఉంచుకొని కేబినెట్​ భేటీ అనంతరం వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details