ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది! మోదీ జోరుకు హస్తం పార్టీ తన హవాను కోల్పోతోంది. 2014 నుంచి ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపు ఇంతే. అయితే రాబోయే బిహార్ ఎన్నికలతో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని సంపాదించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. హస్తం పార్టీ నేతృత్వంలోని 'మహాఘట్ బంధన్' బిహార్లో విజయకేతనం ఎగురవేయాలని చూస్తుంటే.. అధికార పార్టీ అయిన జేడీయూ కూటమి మాత్రం ప్రత్యర్థులను ఓడించాలనే పట్టుదలతో ఉంది.
ఘన చరిత్ర...
ఒకప్పుడు బిహార్లో 196 సీట్లు గెలిచిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో 27 సీట్లకే పరిమితమైంది. గతంలో రాష్ట్రానికి 20 మంది ముఖ్యమంత్రులను ఇచ్చిన పార్టీ ప్రస్తుతం అవస్థలు పడుతోంది. కాంగ్రెస్ పుంజుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావట్లేదు. కాంగ్రెస్ ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలంటే 2015లో పోటీ చేసిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ ఎందుకు పొత్తులను నమ్ముకుంటోంది..? ఇలా అయితే కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా నమ్ముతున్నారు..? వంటి అంశాలపై బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా మాట్లాడారు.
"క్షేత్ర స్థాయిలో పనులు సీనియర్ నేతలకు అప్పగించనున్నాం. ఖాళీగా ఉన్న స్థానాలను కొత్త వారితో భర్తీ చేస్తాం. పనితీరు, ప్రదర్శనను అంచనా వేసి.. ఆ నివేదికను అధిష్ఠానానికి పంపుతాం. వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులను పరిశీలిస్తాం. 2015లో కంటే కచ్చితంగా ఎక్కువ సీట్లలో పోటీచేసి విజయం సాధిస్తాం".
- మదన్ మోహన్ ఝా, బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు
బిహార్లో కాంగ్రెస్ పని అయిపోయిందని.. పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్. నితీశ్ అధ్యక్షతన కూటమి అద్భుతంగా పనిచేస్తున్నప్పడు.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.