ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో మేరునగధీరుడు. సంక్షోభ సమయాల్లో చిక్కుముడులను అవలీలగా విప్పే నేర్పరి. పార్లమెంటరీ వ్యవస్థను ఔపోసన పట్టిన ఈ అపర చాణుక్యుడు. ఈ మహోన్నతమూర్తిని కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
ప్రస్థానం
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చవిచూసిన ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమబెంగాల్‌లోని మిరాటీలో 1935 డిసెంబర్ 11న జన్మించారు. పొలిటికల్ సైన్స్, చరిత్రలో ఎంఏ చేసిన ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు క్లర్క్‌గా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా పని చేశారు.
1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రణబ్. 1982లో పిన్న వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏ అంశంమీదైనా అనర్గళంగా ప్రసంగించగల ప్రణబ్.... చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన వ్యక్తి.
పదవులకే వన్నె తెచ్చిన నేత
కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ.... ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని చాటిన ప్రణబ్ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ దేశం తరఫున గళం విన్పిస్తూ ప్రత్యేకత నిలుపుకొన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్రప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరిల తర్వాత భారతరత్న పొందిన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. 1984లో యూరో మని మేగజీన్ నిర్వహించిన సర్వేలో ప్రణబ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు. 1991 నుంచి 1996 వరకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా 1987-89 మధ్య ఏఐసీసీ ఆర్థికసలహామండలి ఛైర్మన్‌గా ప్రణబ్ వ్యవహరించారు.