ఈ ఏడాది జరగనున్న పశ్చిమ్ బంగా అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్, ప్రధాన పోటీదారుగా భావిస్తున్న భాజపా పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు తలనొప్పి తెప్పిస్తుంటే.. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల వరుస పర్యటనలతో కమలం పార్టీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అయితే.. ఇదంతా భాజపా ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణిస్తున్న తృణమూల్ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అదే సరస్వతీ పూజ. వసంత పంచమిగా కూడా పిలిచే ఈ పండుగను బంగాల్ వ్యాప్తంగా ఫిబ్రవరి 16న జరుపుకోనున్నారు. ఈ వేదికగానే ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది టీఎంసీ.
ఇదీ చూడండి:బంగాల్ దంగల్: నందిగ్రామ్‌లో మళ్లీ ఆనాటి రక్తపాతం!
యువ ఓటర్లను ఆకర్షించేందుకే..!
బంగాల్ సంప్రదాయాలకు తలమానికంగా నిలిచే ఈ వేడుకలను.. ప్రజలతో మమేకమయ్యేలా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు టీఎంసీ నేతలు. ఈ ఉత్సవాల్లో ఎక్కువగా కనిపించే విద్యార్థులు, యువతను తమ వైపు తిప్పుకునేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చూడండి:బంగాల్ దంగల్: ఓవైసీ ఎంట్రీతో దీదీకి పరేషాను?
ఈ సందర్భంగానేబంగాల్ ప్రజలు.. యుగాలుగా సరస్వతీ పూజను జరుపుకొంటున్నారని, భాజపా దీనిపై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు తృణమూల్ కౌన్సిలర్ బైశ్వనార్ ఛటోపాధ్యాయ్. మతపరమైన విశ్వాసాలను దెబ్బకొట్టి లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. అయితే.. ఈ వేడుకల్లో విద్యార్థులతో మాట్లాడే అవకాశం తమకు దొరుకుతుందని అన్నారు.
''బంగాల్ ప్రజలు యుగాలుగా సరస్వతీ పూజను జరుపుకొంటున్నారు. ఇది ప్రజల మధ్య అనుబంధానికి చక్కని వేదిక. ఈ సందర్భంగా.. యువ ఓటర్లైన వేర్వేరు విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన విద్యార్థులతో మాట్లాడే అవకాశం మాకు దొరుకుతుంది. మేం.. భాజపాలా నీచ రాజకీయాలకు పాల్పడబోం. మత విశ్వాసాలను రెచ్చగొట్టి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కమలం పార్టీ చూస్తోంది. మేం అలా చేయం.''
- బైశ్వనార్ ఛటోపాధ్యాయ్, తృణమూల్ కౌన్సిలర్