బంగాల్లో మరో 'దిశ'.. విద్యార్థుల నిరసన బాట బంగాల్లోని దక్షిణ దినాజ్‌పుర్ జిల్లా కుమార్‌గంజ్‌లో కాలిపోయిన బాలిక మృతదేహం కలకలం రేపింది. శవానికి సమీపంలో వీధి కుక్కలు ఘర్షణ పడుతుండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహంపై కత్తిపోట్లు, రక్తపు మరకలను గుర్తించారు పోలీసులు. బాలిక మృతదేహాన్ని రాత్రివేళ కుక్కలు పీక్కు తిని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మహబూబ్ అలీ అనే వ్యక్తి నిందితుడని తేలింది. అలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విద్యార్థుల ఆగ్రహం
బాలిక హత్యపై ఆగ్రహించిన విద్యార్థులు, స్థానికులు 512 నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసన చేపట్టారు. ఫలితంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఎంపీ మద్దతు..
విషయం తెలుసుకున్న భాజపా ఎంపీ సుకాంత మజుందర్ అక్కడి చేరుకుని నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో నిందితుడికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.