తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''

తుషార్‌ గాంధీ... మహాత్మాగాంధీ మునిమనుమడు. బాపూజీ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్న అనుచరుడు. మహాత్మాగాంధీ ఫౌండేషన్‌ అధ్యక్షుడిగా గాంధేయ సిద్ధాంతాలను నేటి తరానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. సమాజంలో శాంతి, సామరస్యం కోసం తనవంతు కృషి చేస్తున్నారు.  మహాత్ముడి 150వ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ఈటీవీ భారత్‌ ఆయనను ఇంటర్వ్యూ చేసింది.

''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''

By

Published : Aug 23, 2019, 7:07 AM IST

Updated : Sep 27, 2019, 11:05 PM IST

''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''

ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న అతివాదం, అసహనంపై ఆందోళన వ్యక్తం చేశారు బాపూజీ మునిమనుమడు తుషార్​ గాంధీ. వీటికి వ్యతిరేక భావజాలం సైతం అంతే స్థిరంగా ఉన్నందున.. మంచి రోజులు మళ్ళీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బాపూజీ జీవించి ఉంటే.. నేటి పరిస్థితులను సరిచేసేందుకు తక్షణం స్పందించేవారని చెప్పారు.

గాంధేయ భావజాలంపై...

''గాంధీజీ భావజాలం స్థిరమైనది, ఆయన విధానాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించింది. మానవజాతి సృజించిన స్థిరమైన భావజాలాల్లో.. గాంధేయ విధానం ఒకటి.

నిలకడలేని మన జీవనశైలిని సరిచేయాలంటే.. గాంధేయ భావజాలం తప్ప వేరే మార్గం లేదు. గాంధేయవాదం చాలాకాలం పాటు కొనసాగింది. అది ఎప్పటికీ నిలిచి ఉండేదని రుజువైంది.''

- తుషార్​ గాంధీ, మహాత్మా గాంధీ మునిమనుమడు

గాంధేయ భావజాలం అనే ఆలోచన ఆధునిక కాలం కనిపెట్టిన ఆవిష్కరణ కాదు అని తుషార్ గాంధీ చెప్పారు.

''నాగరికత, సమాజ నిర్మాణం నాలుగు మూల స్తంభాలపై ఆధారపడింది. ప్రకృతిని నాశనం చేయకుండా, విభిన్న భావజాలం కలిగిన ప్రజల్ని గౌరవిస్తూ.. స్థిరంగా జీవించే ఏకైక పద్ధతి గాంధేయ భావజాలమేనని రుజువైంది.'' అని తుషార్‌ గాంధీ స్పష్టం చేశారు. గాంధేయ భావజాలం ప్రపంచ ఆమోదాన్ని క్రమంగా పొందుతోందన్నారు.

" రుగ్మత ప్రభావం కనిపించక ముందే బాపూజీ చర్యలు"

''తీవ్రమైన అసహనం, హింస మధ్య నేడు ప్రజలు బతుకుతున్నారు. ఈ పరిస్థితులపై మహాత్మా గాంధీ ఎక్కువ కాలం వేచిచూసే ధోరణి అవలంబించరని'' తుషార్ గాంధీ చెప్పారు.

"చంపడం ఓ అలవాటైంది. చివరకు దానిని అంగీకరించే పరిస్థితి వచ్చింది. కొందరికి ఈ హింస జీవన విధానమైంది. ఘర్షణలకు దూరంగా ఉండే ప్రజలు.. తమ మౌనంతో హింసను అంగీరిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరం."

- తుషార్​ గాంధీ

ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడంపై మహాత్మాగాంధీకి స్పష్టమైన అవగాహన ఉందని తుషార్‌ గాంధీ తెలిపారు. తక్షణ, తాత్కాలిక ఉపశమన చర్యలకు ఆయన వ్యతిరేకం. మూలం నుంచి రోగాన్ని నయం చేసే వైద్యుడిగా గాంధీజీ పనిచేస్తారని వివరించారు.

" సమాజంలోని అవలక్షణాలు బాపూజీ ముందే గ్రహిస్తారు. ఆ తెగులు ప్రభావం కనిపించక ముందే చర్య తీసుకునేలా ఆయన విధానం ఉంటుంది.'' అని తుషార్​ గాంధీ అన్నారు.

''నేడు అతివాదం ప్రబలంగా ఉంది. అది నిలబడదు.''

ప్రపంచవ్యాప్తంగా గాంధేయ వాదానికి ప్రత్యేక ఆకర్షణ ఉందని తుషార్‌ గాంధీ చెప్పారు. ఎందుకంటే.. అన్ని భావజాలాలను ప్రయత్నించి అంతా గాంధీ భావజాలానికి ఆకర్షితులయ్యారన్నారు.

''ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను చూస్తుంటే.. మనకు ఆశలు లేనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా అతివాదం విస్తరిస్తోంది. తీవ్రవాదం, అసహన భావజాలాలు ప్రపంచంపై బలమైన ముద్ర వేస్తున్నాయి. అయితే... తమ భావజాలం స్థిరమైనది కాదని అతివాదులు గ్రహిస్తున్నారు. అందుకే.. తమ లక్ష్యాలు సాధించేందుకు హడావుడి ప్రయత్నాలు చేస్తున్నారని''తుషార్‌ గాంధీ చెప్పారు. గాంధేయ భావజాలం సహజమైనదని తుషార్‌గాంధీ స్పష్టం చేశారు.

"ప్రతి ఒక్కటీ కోల్పోయినట్లు అనిపించిన ప్రతిసారీ, మేము తిరిగి గాంధేయ భావజాలాన్ని అనుసరించాం. స్థిరమైనది ఉదారవాదమే కానీ.. ఉగ్రవాదం కాదు.'' అని పేర్కొన్నారు.

స్వచ్ఛ భారత్ గాంధేయ మార్గమే...

ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ భారత్‌ మిషన్‌.. గాంధేయ భావజాలాన్ని పాక్షికంగా అర్థం చేసుకున్న కార్యక్రమమని తుషార్ గాంధీ తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కంటే.. ఆత్మశుద్ధి చాలా ముఖ్యమైందన్నారు.

''పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశమే, కానీ... ఆత్మశుద్ధి, సోదరభావం చాలా ముఖ్యం. బాహ్య ప్రక్షాళన ఎంత సులభమో, అంతర్గత లోపాలను విస్మరించడం అంత తేలిక. మనం ఎంత శుభ్రం చేశామన్నది విషయం కాదు. మనసు మురికిగా ఉన్న మనిషి.. మరింత మకిలీని సృష్టిస్తూనే ఉంటాడు.''

- తుషార్​ గాంధీ

''గాడ్సే ఈ రోజు హీరో అని స్పష్టంగా తెలుస్తుంది''

ఈ రోజుల్లో హత్య, విద్వేష భావజాలాన్ని ప్రజలు అనుసరించడం చూసి తాను ఆశ్చర్యపోనని తుషార్‌గాంధీ అన్నారు. నేటి పరిస్థితులను జ్వరంతో పోల్చిన ఆయన... ఇది సాధారణ లక్షణం కాదన్నారు.

''సహజంగా ప్రజలు శాంతికాముకులు, సురక్షితంగా జీవించాలని కోరుకుంటారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ, అతివాదులుగా జీవించడం మనిషి లక్షణం కాదు. అది జ్వరం లాంటిది. ఆ రోగాన్ని నిర్మూలించవచ్చు. దేశంలో ఈ రోజు గాడ్సే హీరో అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇలాంటి సమయాల్లో.. గాంధేయ భావజాలపు వీరోచిత లక్షణాలను చూపించే తెగువ ఉండాలి."

- తుషార్​ గాంధీ

ప్రస్తుత తరం సురక్షితమైన జీవనాన్ని పోగొట్టుకుందన్న తుషార్‌ గాంధీ.. వచ్చే తరం కోసమైనా ఉదారవాద సమాజం కోసం కృషి జరగాలన్నారు.

''ప్రతిఒక్కరూ స్థిరమైన భావజాలం కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే.. హత్య, ద్వేష భావజాలం మానవ జాతితోనే ఆగిపోదు. అన్ని జాతుల ప్రాణాల్ని, పర్యావరణాన్ని, ప్రకృతిని ప్రమాదంలో పడేస్తుంది. ఈ ద్వేష భావజాలం ఒక్కరితో ఆగిపోదు. అయినా... మసకబారిన సమయంలోనూ వెలుగురేఖల ఆశలు నిలిచే ఉంటాయి. మహాత్ముడు మరణించినప్పటికీ గాంధేయ భావజాలం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలను ప్రేరేపిస్తూనే ఉంది.''

-తుషార్‌ గాంధీ

భావజాలాన్ని అడ్డగించలేరు...

స్వయం సమృద్ధి కలిగిన గాంధేయ భావజాలాన్ని నడిపించేందుకు ఎలాంటి చోదక శక్తి అవసరం లేదని తుషార్ గాంధీ చెప్పారు. ఆయన భావజాలాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

"గాంధేయ భావజాలాన్ని మనస్సులోకి చొప్పించలేం. బలమిచ్చే ఔషధంలాగా అందించలేం. ఆ భావజాలాన్ని అర్థం చేసుకోవాలి. దానికి బోధన అవసరం లేదు"

ఈ రోజు అందుతున్న సుస్థిరత ఒక్కటే ద్వేషానికి కారణమని తుషార్‌ గాంధీ అన్నారు. ప్రజలు త్వరలోనే గాంధేయ భావజాలాన్ని అర్థం చేసుకుంటారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పటికీ, గాంధేజీ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు ప్రేరణనిచ్చిందని ఆయన అన్నారు.

"మహాత్ముడి భావజాలాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే అతివాదులు.. ఆయనను హత్య చేసిన తర్వాత కూడా గాంధీజీ ఆలోచనను మభ్యపెట్టలేరని గ్రహించారు. గాంధీ భావజాలాన్ని అడ్డగించలేరు" అని ఆయన అన్నారు.

Last Updated : Sep 27, 2019, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details