ఓ ప్రైవేట్ బ్యాంకు చేసిన నిర్వాకానికి.. నిర్మాణదశలో ఉన్న ఓ ఇంటిలో 50 మంది చిక్కుకున్న ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. మీడియా చొరవతో వారు బయటపడ్డారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాము గంటలపాటు గృహనిర్బంధంలో ఉండాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
దిల్లీలోని రోహిణి ప్రాంతం సెక్టార్ 25లో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. యజమానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా... కొంత మంది బ్యాంకు అధికారులు... పోలీసుల సమక్షంలోనే ఇంటికి సీల్ వేశారు. రుణం చెల్లించకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.
సీల్ వేసే సమయంలో నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ఇంట్లోనే ఉన్నారు. వారిలో మహిళలూ, చిన్నారులూ ఉన్నా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. బాధితులు సహాయం కోరినా పోలీసులు స్పందించలేదు. కొన్ని గంటలపాటు వారు ఆ ఇంట్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చివరకు వారు మీడియాను ఆశ్రయించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బాధితులు ఇంటి నుంచి బయటపడ్డారు.