హిమాచల్‌ప్రదేశ్ కులూ నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న బిజిలీ మహాదేవ్(పిడుగుపాటు శివుడు).. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భక్తులను కాపాడేందుకు తన తలపైనే పిడుగు పడేలా చేసుకుంటాడని నమ్ముతారు. అందుకే, ఆ త్రినేత్రుడి దర్శనభాగ్యం పొందేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ శైవక్షేత్రానికి చేరుకుంటున్నారు భక్తులు.
ముక్కలై అతుక్కుంటుంది..
ఈ బిజిలీ మహదేవ్ ఆలయంలో 12 ఏళ్లకు ఓసారి మహా అద్భుతం సాక్షాత్కరిస్తుంది. దేవేంద్రుడు ఆదేశించిన ఆ పిడుగు పెళపెళ ధ్వనితో.. ఆకాశమంత ప్రకాశంతో.. శరవేగంగా శివలింగాన్ని ఢీకొడుతుంది. పిడుగుపాటుకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ, ఆలయ పూజారి విరిగిన శివలింగ ముక్కలను తిరిగి పేర్చి మహేశ్వరుడికి వెన్నతో రాస్తాడు. అంతే, మరో మరమ్మతు అవసరం లేకుండా ఆ వైద్యానాథేశ్వరుడికి తగిలిన పిడుగు దెబ్బలన్నీ మాయమైపోతాయి.. క్రమంగా శివలింగం అతుక్కుని పూర్వ రూపాన్ని దాల్చుతుంది.. ఇక్కడ ఇలా పిడుగులు పడడం సాధారణం.. శివలింగం తిరిగి అతుక్కోవడమూ సర్వసాధారణం.
"మేము ఏటా బిజిలీ మహదేవ్ దర్శనానికి వస్తాం. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నాం. ఇతిహాసాల్లో ఏముందంటే ఈ ఆలయంలో శివ లింగంపై పిడుగు పడుతుంది. అది చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు. ఇక్కడ కోరిన కోర్కెలు తీరుతాయి కాబట్టే మళ్లీ మళ్లీ దర్శనానికి వస్తారు భక్తులు."