రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌పై సిట్ ప్రశ్నల వర్షం కర్ణాటక శివాజీ నగర్ ఎమ్మెల్యే.. రోషన్ బేగ్‌ను సుదీర్ఘ విచారణ అనంతరం విడుదల చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్). ఐఎంఏ పోంజి అవినీతి కేసులో ఆయనను గత రాత్రి అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు... మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేశారు.
'ఆయనను విచారించేందుకు అదుపులోకి తీసుకున్నాం. జులై 19న మరోసారి సిట్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.'
- సిట్ అధికారి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంతో కాంగ్రెస్ గతంలోనే రోషన్ బేగ్‌ను సస్పెండ్ చేసింది. తాజా సంక్షోభానికి కారణమైన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాల పరంపరలో బేగ్ ఒకరు.
సోమవారం రాత్రి.. బెంగళూరు విమానాశ్రయంలో బేగ్‌ను అదుపులోకి తీసుకుంది సిట్. జులై 15నే విచారణకు హాజరుకావాలని గతంలో ఈ రెబల్ ఎమ్మెల్యేను ఆదేశించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. కానీ.. వ్యక్తిగత పనుల నిమిత్తం జులై 25న అందుబాటులో ఉంటానని తెలిపారు రోషన్. అనంతరం... బెంగళూరు నుంచి పుణెకు వెళ్తున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.
గందరగోళంతోనే...
పారిపోతున్నాననే గందరగోళంతోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విడుదల అనంతరం తెలిపారు రోషన్ బేగ్. జులై 19న విచారణకు హాజరై.. సహకరిస్తానని పేర్కొన్నారు. సిట్.. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చిందన్నారు.
రోషన్ అరెస్టు అనంతరం.. సీఎం కుమారస్వామి భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్, భాజపా ఎమ్మెల్యే యోగేశ్వర్.. అరెస్టు సమయంలో విమానాశ్రయంలోనే ఉన్నారని ఆరోపించారు. కేసులో ఉన్న వ్యక్తిని ముంబయి తరలించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కుమారస్వామి.
సీఎం ఆరోపణలను తిప్పికొట్టింది కాషాయ పార్టీ. ఆ సమయంలో సంతోష్ అక్కడ లేరని తెలిపింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు.. కుమారస్వామి సర్కార్ రాష్ట్ర యంత్రాంగాన్ని వినియోగిస్తోందని ఆరోపించింది. సీసీ ఫుటేజి తెప్పించి విచారణ జరిపితే నిజాలు తెలుస్తాయని పేర్కొంది.
ఇదీ చూడండి:
సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!