తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు

విమానాశ్రయాల ప్రైవేటీకరణ కోసం కేంద్ర కేబినెట్​కు మరిన్ని ప్రతిపాదనలు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మరోవైపు కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎయిర్ బబుల్​ ఏర్పాట్లు చేయాలని మరిన్ని దేశాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరినాటికి దేశీయ విమాన ప్రయాణాలు కొవిడ్​పూర్వ స్థితికి చేరుకుంటాయని స్పష్టం చేశారు.

Aviation Ministry to present proposal on 'further airport privatisation' to Cabinet on Wed: Puri
మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు

By

Published : Aug 18, 2020, 6:32 PM IST

విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించిన మరిన్ని ప్రతిపాదనలను పౌర విమానయాన శాఖ... కేంద్ర కేబినెట్ ముందు ఉంచనున్నట్లు ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఓ వెబినార్​లో పాల్గొన్న ఆయన.. చాలా విమానాశ్రయాలు ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

"ఎయిర్​పోర్ట్ ప్రైవేటీకరణ కోసం మేం కేబినెట్ ముందుకు వెళ్తున్నాం. చాలా విమానాశ్రయాలు ఈ(ప్రైవేటీకరణ) వరుసలో ఉన్నాయి. 2030లోపు మొత్తం 100 కొత్త ఎయిర్​పోర్టులను నిర్మిస్తాం."

-హర్దీప్ సింగ్ పూరి, పౌర విమానయాన శాఖ మంత్రి

మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే లఖ్​నవూ, అహ్మదాబాద్, జైపుర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల నిర్వహణను ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ప్రైవేటీకరించారు. ఇదే బాటలో అమృత్​సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్​పుర్, తిరుచిరాపల్లి(ట్రిచి) విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించాలని ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2019లో పౌర విమానయాన శాఖకు సిఫార్సు చేసింది.

అదానీకి మరో మూడు నెలలు

పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ ప్రస్తుతం దేశంలోని 100కు పైగా విమానాశ్రయాల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. లఖ్​నవూ, అహ్మదాబాద్, మంగళూరు, జైపుర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల నిర్వహణ హక్కులను 2019 ఫిబ్రవరిలో జరిగిన పోటీ బిడ్లలో అదానీ ఎంటర్​ప్రైజెస్ గెలుచుకుంది. తొలి మూడు విమానాశ్రయాలకు సంబంధించి అదే నెల 14న ఒప్పందం సైతం కుదుర్చుకుంది. అయితే మిగిలిన మూడు విమానాశ్రయాలపై ఒప్పందం కుదరలేదు.

కొవిడ్ నేపథ్యంలో అదానీ గ్రుప్​కు లఖ్​నవూ, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాల నిర్వహణ హక్కులను మరో మూడు నెలలు పొడగించింది ఏఏఐ. ఆగస్టు 12తో ముగిసే గడువు.. నవంబర్ 12 వరకు ముందుకు జరిపింది.

ఏడాది చివరకు రద్దీ సాధారణం!

సోమవారం ఒక్కరోజే 94 వేల మంది ప్యాసెంజర్లు దేశీయ విమానాల్లో ప్రయాణించారని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కొవిడ్ మహమ్మారికి ముందు రోజుకు 3 లక్షల మంది ప్రయాణించేవారని పేర్కొన్నారు. దీపావళి నాటికి ఇందులో 50-50శాతానికి చేరుకుంటామని వెల్లడించారు. ఈ ఏడాది చివరికి ప్రయాణికుల రద్దీ విషయంలో కొవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని దేశాలతో 'వాయు బుడగ'

అంతర్జాతీయ విమాన సర్వీసులలో ప్రత్యేక వాయు బుడగ(ఎయిర్ బబుల్) ఏర్పాట్లు చేయాలని ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ సహా మొత్తం 13 దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి హర్దీప్ తెలిపారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్, భూటాన్ దేశాలతోనూ ఈ ఎయిర్​బబుల్ ప్రతిపాదన చేసినట్లు మంత్రి తెలిపారు. వీటితో పాటు ఇటలీ, న్యూజిలాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణ కొరియా, థాయ్​లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇతర దేశాలతోనూ మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ వాయు బుడగ ఒప్పందం ద్వారా ఇరుదేశాల ఎయిర్​లైన్లు పలు ఆంక్షలతో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది కేంద్రం. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతార్, మాల్దీవులతో భారత్​ ఈ ఒప్పందాన్ని చేసుకుంది.

ఇదీ చదవండి-'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?

ABOUT THE AUTHOR

...view details