అసోంలో వరదల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. వివిధ ప్రాంతాల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 33 జిల్లాలకు గానూ 26 జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 28.32లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు.
పరిస్థితిని సమీక్షించేందుకు అసోం గవర్నర్ జగదీశ్ ముఖి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరనున్నట్టు వెల్లడించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా వరదల కారణంగా నీట మునిగిన రెండు జిల్లాలను సందర్శించారు.
అసోం వరదల్లో ఇప్పటివరకు 93మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26మంది కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో చనిపోయారు. 1.19లక్షల హెక్టార్ల పంటనష్టం సంభవించింది.