తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: అరుణాచల్​ పీఠం ఎవరిది? - 2019 ఎన్నికలు

అరుణాచల్​ప్రదేశ్​ రాజకీయాల్లో గత మూడేళ్లలో ఊహించని మలుపులెన్నో. 2016 ఏప్రిల్​-డిసెంబర్​ మధ్యలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్​ ముఖ్యమంత్రులెందరో మారారు. రాష్ట్రపతి పాలన విధించారు. ఇలాంటి ఎన్నో కీలక ఘటనలు జరిగిన ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల పండుగ ఏప్రిల్​ 11నే. అసెంబ్లీ, లోక్​సభలకు ఒకే దశలో నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపా మధ్యే ప్రధాన పోరు.

అరుణాచల్ ప్రదేశ్

By

Published : Apr 9, 2019, 6:10 AM IST

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ప్రదేశ్​ ప్రకృతి అందాలకు నెలవు. సూర్యుడు ఉదయించే భూమి. ఇప్పుడీ రాష్ట్రంలో కమలం వికసిస్తుందా లేక కాంగ్రెస్​ జయకేతనం ఎగరవేస్తుందా అన్నది ఆసక్తికరం.

అరుణాచల్​ ప్రదేశ్​లో లోక్​సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: భారత్​ భేరి: కాశీలో చౌకీదార్​ X జవాన్

అరుణాచల్​ ప్రదేశ్​

అసెంబ్లీ స్థానాలు 60
లోక్​సభ స్థానాలు 2
ఓటర్లు 7, 94, 162
మహిళలు 4, 01, 601
పోలింగ్​ కేంద్రాలు 2,202
పోలింగ్​ తేదీ ఏప్రిల్​ 11
ఫలితాలు మే 23

అరుణాచల్ ​ప్రదేశ్​లో ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్ మధ్యే. అరుణాచల్​ పశ్చిమ లోక్​సభ స్థానం నుంచి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్​ రిజుజు బరిలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్​ తరఫున.. మాజీ ముఖ్యమంత్రి నబం తుకి పోటీకి దిగారు.

1978లో జనతా పార్టీ గెలవడం మినహా.. ఇప్పటివరకు 8సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయం. ఈ ఎన్నికల్లో గెలిచి.. ఒకప్పటి వైభవాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని భావిస్తోంది హస్తం పార్టీ.

పరిస్థితులు పూర్తిగా భిన్నం...

2014 ఎన్నికల్లో కాంగ్రెస్​ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2016లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. చివరకు... పాలనా పగ్గాలే చేతులు మారాయి. పీపుల్స్​ పార్టీ ఆఫ్​ అరుణాచల్​-పీపీఏకు చెందిన 33మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరగా... ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి నాటకీయ పరిణామాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుత అసెంబ్లీలో బలాబలాలు

భాజపా 48
కాంగ్రెస్ 5
పీపీఏ 2
స్వతంత్రులు 2

కీలక నేతలు

భాజపా:కిరణ్​ రిజిజు, పెమా ఖండు

కాంగ్రెస్​:నినోంగ్​ ఎరింగ్​, తకమ్​ సంజయ్​

అభివృద్ధి మంత్రంతో భాజపా...

అభివృద్ధే ప్రధానాంశంగా భాజపా ఎన్నికల బరిలో దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా... రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.

అరుణాచల్​ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న నేషనల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీపీ)... తాము పోటీచేయని స్థానాల్లో భాజపాకు మద్దతు ప్రకటించింది. అరుణాచల్​ ప్రదేశ్​ తూర్పు లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసే భాజపా అభ్యర్థితో పాటు.. తూర్పు పరిధిలోని 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల విజయానికి కృషి చేయనుంది ఎన్​పీపీ.

ఎన్నికల అనంతరం పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది ఎన్​పీపీ. ఆ పార్టీ ఇప్పటికే మేఘాలయ, మణిపుర్​, నాగాలాండ్​లో భాజపాకు మిత్రపక్షం.

'పీఆర్​సీ, ఎన్​ఆర్​సీ'లే విపక్షాల అజెండా

ప్రతిపక్షాలు పౌరసత్వ బిల్లు, శాశ్వత నివాస ధ్రువీకరణను ట్రంప్​కార్డ్​గా భావిస్తున్నాయి. అవినీతి, శాంతి భద్రతలూ ఇక్కడి విపక్షాల ప్రధాన అజెండా.

ఎస్టీ జాబితాలో లేని కొన్ని వర్గాల ప్రజలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం(పీఆర్‌సీ) ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అరుణాచల్‌లో ఘర్షణలకు దారి తీసింది. పౌరసత్వ బిల్లుపైనా అరుణాచల్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఎన్నికలపై ఈ రెండు అంశాలు ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

ప్రత్యేక హోదా హామీతో కాంగ్రెస్​...

అభివృద్ధి మంత్రంతో భాజపా ఓటర్లను ఆకర్షిస్తుంటే.. కాంగ్రెస్​ ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే అరుణాచల్​ప్రదేశ్​కు హోదా ఇస్తామంటూ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించారు.

కాంగ్రెస్​కు దూరం: పీపీఏ

పీపుల్స్​ పార్టీ ఆఫ్​ అరుణాచల్​ ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు పెట్టుకోవట్లేదని ఆ పార్టీ ఛైర్మన్​ కమేన్​ రింగు ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగతున్నట్లు స్పష్టం చేశారు.

''కాంగ్రెస్​ వంటి జాతీయ పార్టీలతో మాకెలాంటి పొత్తు లేదు. అవి రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. అందుకే ఇప్పుడు పీపీఏ అభ్యర్థుల్ని తమవైపు లాక్కోవాలని చూస్తున్నాయి. మా ప్రాంతీయ భావజాలం చెక్కుచెదరకుండా ఉండేందుకు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం. ఇక్కడి ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలకు కట్టుబడి అభివృద్ధి చేయడమే మా ఎన్నికల అజెండా.''

- కమేన్​ రింగు, పీపీఏ ఛైర్మన్​

2014 ఎన్నికల్లో రెండు లోక్​సభ స్థానాల్లో భాజపా, కాంగ్రెస్​ చెరొకటి గెల్చుకున్నాయి. భాజపా తరఫున కిరణ్​ రిజుజు, కాంగ్రెస్​ తరఫున నినోంగ్​ ఎరింగ్​ విజయం సాధించారు. ఈసారి 2 స్థానాలూ దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details