తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై నేడు సుప్రీంలో విచారణ - J&K

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో కేంద్రం విధించిన ఆంక్షలపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాంగ్రెస్​ కార్యకర్త తెహ్​సీన్​ పూనవల్లా పిటిషన్​తో పాటు పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు విననుంది ధర్మాసనం.

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై నేడు సుప్రీంలో విచారణ

By

Published : Aug 13, 2019, 5:33 AM IST

Updated : Sep 26, 2019, 8:06 PM IST

జమ్ముకశ్మీర్​లో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపైనా వాదనలు విననుంది. కశ్మీర్​లో కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్​ కార్యకర్త తెహ్​సీన్​ పూనవల్లా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆర్టికల్​ 370పైన తాను స్పందించడం లేదని, జమ్ముకశ్మీర్​లో ఆంక్షలు ఎత్తివేయాలని మాత్రమే కోరుతున్నట్లు పూనవల్లా తెలిపారు. అలాగే మొబైల్ సేవలు​, అంతర్జాల వినియోగం, న్యూస్​ ఛానళ్ల రద్దు వంటి అంశాలపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని నిర్భంధం నుంచి విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఏ అధికారంతో వీరిని అధీనంలోకి తీసుకుందో సుప్రీం ప్రశ్నించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

మరిన్ని వ్యాజ్యాలు

పూనవల్లా పిటిషన్​తో పాటు అనూరాధా భాసిన్​ దాఖలు చేసిన ప్రత్యేక వ్యాజ్యం, కశ్మీర్​లో విధించిన ఆంక్షలతో పాత్రికేయుల విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందన్న కశ్మీర్​ టైమ్స్​ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పిటిషన్​పైనా సుప్రీం అత్యవసర విచారణ జరిపే అవకాశముంది.

నేషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్​సీ) నేతలు మహమ్మద్​ అక్బర్​ లోన్​, హోస్నన్​ మక్సూస్​ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. జమ్ముకశ్మీర్​ ప్రజలకు వ్యతిరేకంగా ఆర్టికల్​ 370ని రద్దు చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు ఎన్​సీ లోక్​సభ ఎంపీలు.

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులపై న్యాయవాది మనోహర్​ లాల్​ శర్మ కోర్టు మెట్లెక్కారు. వీటన్నిటిపైనా అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది.

Last Updated : Sep 26, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details