శ్యామాప్రసాద్ ముఖర్జీ... భాజపాకు పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు. జీవిత పర్యంతం జమ్ముకశ్మీర్ విలీనం కోసం ఉద్యమించారు. రాజ్యాంగంలోని అధికరణం 370ని తీవ్రంగా వ్యతిరేకించారు.
జమ్ముకశ్మీర్‌ను సంపూర్తిగా భారత యూనియన్‌లో విలీనం చేయాలనేది ఆయన కల. దానికోసం ఉద్యమిస్తూనే ప్రాణాలు వదిలారు. ఎట్టకేలకు ఇన్నేళ్లకు అధికరణం 370ని రద్దు చేయడం ద్వారా భాజపా ముఖర్జీ కలలను సాకారం చేసినట్లుగా భావిస్తున్నారు.
తుది శ్వాస వరకూ పోరాటం..
శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాలీ. న్యాయవాది. విద్యావేత్త. సర్ అశుతోష్ ముఖర్జీ తనయుడు. నెహ్రూ మంత్రివర్గంలో ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. జమ్ముకశ్మీర్ సహా పలు అంశాలపై నెహ్రూతో విభేదించి మంత్రిపదవిని వదులుకున్నారు.
1951 అక్టోబర్ 21న జనసంఘ్‌ను స్థాపించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక రాయితీలేమీ లేకుండా భారత్‌లో కలిపెయ్యాలని ఒత్తిడి చేశారు. కనీసం జమ్ము, లద్దాఖ్‌లనైనా భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జనసంఘ్ కార్యకర్తలు, హిందూమహాసభ, రామరాజ్య పరిషత్‌లతో కలిసి ఉద్యమించారు.
1953 మే 11న అనుమతి లేకుండా జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించగా.. షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి శ్రీనగర్ జైలులో ఉంచింది. జూన్ ప్రారంభంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. జూన్ 22న గుండెపోటు వచ్చింది. జూన్ 23న మరణించారు.
కల నెరవేర్చిన మోదీ
మోదీ భాజపా కార్యకర్తగా ఉన్న రోజుల్లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలని పోరాటం చేశారు. ఇప్పుడు స్వయంగా (కేంద్ర ప్రభుత్వం) ఆర్టికల్‌ను రద్దు చేసి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను నిజం చేశారు.
ఇదీ చూడండి: 'ఆర్టికల్ 370'.... అయ్యంగార్ విరచితం!