రాజ్యాంగంలోని 370, 35-ఏ అధికరణలు రద్దుచేస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది భాజపా. అప్పటినుంచి అనుకూల, వ్యతిరేక వాదనలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ అధికరణలపై దశాబ్దాలుగా వ్యతిరేకత చూపుతున్న భాజపా, మాతృ సంస్థలు... నిబంధనల రద్దు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత రాజ్యాంగానికి ఇప్పటికే ఎన్నో సవరణలు చేశారు. కాబట్టి గట్టి సంకల్పం ఉంటే అవి తొలగిపోవడం ఖాయం! ఈ రెండు అధికరణలను రద్దుచేసే క్రమంలో, ఆ తరవాత తలెత్తే రాజకీయ ప్రకంపనలు మాత్రం మామూలుగా ఉండవు.
అసాధారణ నేపథ్యం
రాజ్యాంగంలో ఆర్టికల్-370 ఓ తాత్కాలిక నిబంధన మాత్రమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో స్పష్టంచేశారు. రాజ్యాంగంలో అధికరణ 35-ఏని అసంబద్ధంగా చేర్చారని అరుణ్ జైట్లీ చాన్నాళ్ల క్రితమే విమర్శించారు. అధికరణ-370ని మాత్రమే కాదు, ఇంకా చాలావాటిని రాజ్యాంగంలో తాత్కాలిక, ప్రత్యేక జాబితాల్లో పెట్టారు. అధికరణ-369 మొదలు 392-ఆర్టికల్ వరకూ అధికరణలన్నీ తాత్కాలిక, ప్రత్యేక నిబంధనలుగానే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్ 371-డి సైతం ఈ జాబితాలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడూ 371-డి అధికరణను తొలగించలేదు. కాబట్టి తాత్కాలికం, ప్రత్యేకం అని పేర్కొన్నవాటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తొలగించడానికే పెట్టారని చెప్పలేం!
ఇదీ చూడండి:
ఆర్టికల్ 370, 35ఏలను రద్దుచేయాలి:రాజ్‌నాథ్
రాజ్యాంగంలో ప్రతి కీలక నిబంధనకూ ఎంతో రాజకీయ నేపథ్యం ఉంది. 370-అధికరణ, ఆర్టికల్ 35-ఏలను రాజ్యాంగంలో చేర్చడానికి ఉన్న రాజకీయ, చారిత్రక నేపథ్యం అసాధారణమైంది. ఆనాడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం సమష్టిగా ఆలోచించి వాటికి ఆ స్థానాన్ని కల్పించాయి. ముఖ్యంగా ఆర్టికల్-370 విషయంలో నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్య పూర్తి ఏకాభిప్రాయం ఉంది. జమ్మూకశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనం, దరిమిలా కశ్మీర్‌కు భారత సైన్యాన్ని పంపించడం వరకూ పటేల్, నెహ్రూలు ఒకే కట్టుగా ఉన్నారు. ఆనాడు దేశంలోని చిన్నాపెద్ద సంస్థానాలు భారత్ యూనియన్‌లో విలీనమయ్యే ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన అధికారి వీపీ మేనన్. స్టేట్స్ డిపార్ట్‌మెంట్‌గా పిలిచే విభాగానికి ఆయన కార్యదర్శి. కేంద్ర హోం మంత్రిగా సర్దార్‌పటేల్ సారథ్యంలో ఆయన బాధ్యతలు నిర్వహించారు. పటేల్ కోరిక మేరకు సంస్థానాల విలీనం, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత్‌కు అధికారం దఖలుపడిన పరిణామాలపై ఆయన రెండు పుస్తకాలు రాశారు. అందులో మొదటిది ‘ద స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్‌ద స్టేట్స్’. కశ్మీర్ విలీనం, అది ఎలాంటి షరతులతో జరిగిందో అందులో చాలా సాధికారికంగా రాశారు. కశ్మీర్ విలీనంలో ప్రతి అడుగుకూ ఆయన కీలక సాక్షిగా ఉన్నారు.
భారత ఉపఖండం బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ మొత్తం ప్రాంతం వారి ప్రత్యక్ష పాలనలో లేదు. బ్రిటిష్ ఇండియా పాలన కింద 11 రాష్ట్రాలు ఉండేవి. వాటికితోడు మరో ఆరు ప్రాంతాలు బ్రిటిష్ ఇండియా ముఖ్య కమిషనర్ల పాలనలో నడిచేవి. ఇక చిన్నాపెద్దా కలిసి 565 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాల్లో 9.9 కోట్లమంది జీవించేవారు. బ్రిటిష్ ఇండియా పాలనలోని భూభాగాన్ని భారత్, పాకిస్థాన్ ప్రాంతాలుగా విభజించటానికి అంతా సిద్ధమైపోయింది.
ఇదీ చూడండి:
ఆర్టికల్ 370 రద్దు చేసే దమ్ముందా? :ఫరూక్
ముస్లిములు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పాకిస్థాన్‌గా ప్రకటించారు. బెంగాల్‌లో తూర్పుభాగం, పంజాబ్ పశ్చిమ భాగం పాకిస్థాన్‌కి వెళ్లటంతో ఆ రాష్ట్రాలు నిట్టనిలువుగా చీలిపోయాయి. లక్షల సంఖ్యలో దారుణ మరణాలు అక్కడే ఎక్కువగా జరిగాయి. ఏ సూత్రం ప్రకారం భారత్-పాకిస్థాన్‌ల మధ్య భూభాగాన్ని పంచారో అదే సూత్రం ఆధారంగా సంస్థానాల భూభాగాలను సైతం పంచితే సమస్య ఉండేది కాదు. భారత్-పాక్‌లలో ఏదో ఒకదాంట్లో చేరేందుకు, అందుకు ఇష్టం లేకపోతే స్వతంత్రంగా ఉండేందుకు సంస్థానాధీశులకు స్వేచ్ఛనివ్వడంతో సమస్య మొదలైంది. దీన్ని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్‌కు ఆ విషయాన్ని గట్టిగా చెప్పారు. దాంతో మౌంట్ బాటెన్ రంగంలోకి దిగి సంస్థానాధీశులకు నయానా భయానా నచ్చజెప్పారు. ముస్లిములు ఎక్కువగా ఉండి పాకిస్థాన్ భూభాగానికి సమీపంలోని సంస్థానాలు ఆ దేశంలో కలిసిపోయాయి. హిందువులు మెజారిటీగా ఉన్న సంస్థానాలు భారత్ యూనియన్‌లో కలవటానికి అంగీకరించాయి.
సంస్థానాల్లో అతి పెద్దవైన జమ్మూకశ్మీర్, హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోని జునాగఢ్‌తో సమస్యలొచ్చాయి. జునాగఢ్‌లో మెజారిటీ ప్రజలు హిందువులు. ముస్లిములు తక్కువ. అక్కడి నవాబు మాత్రం ముస్లిం. పైగా పాకిస్థాన్‌తో భౌగోళిక సామీప్యత సైతం లేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని అక్కడి నవాబు తన సంస్థానం పాకిస్థాన్‌లో విలీనం అవుతున్నట్లు ప్రకటించి లాంఛనాలు పూర్తిచేశాడు. పాకిస్థాన్ అగ్రనేత జిన్నా అందుకు పచ్చజెండా ఊపాడు. ఆ పరిణామాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రజాభీష్టం ప్రకారం సంస్థానాల విలీనం జరగాలన్నది కాంగ్రెస్ విధానం. జునాగఢ్‌లో ఆ పద్ధతిని అనుసరించలేదని చెప్పి దాన్ని స్వాధీనం చేసుకుంది. దాంతో నవాబు పాకిస్థాన్ పారిపోయాడు. జునాగఢ్‌లో ప్రజాభిప్రాయ (ప్లెబిసెట్) ప్రక్రియ చేపట్టి విలీనం సంపూర్ణం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు, నవాబు మాత్రం ముస్లిం. నిజాం నవాబు స్వతంత్రంగా ఉండటానికి చాలా ప్రయత్నించాడు. పాకిస్థాన్ సైతం ఇవ్వాల్సిన చేయూతనిచ్చింది. స్వతంత్రంగా ఉండటం ప్రజాభీష్టం కాదని చెప్పినా నవాబు వినలేదు. మరోవైపు కమ్యూనిస్టుపార్టీ నేతృత్వంలో సాయుధపోరాటం మొదలైంది. పరిస్థితి అన్ని విధాల చేయి దాటిపోవడంతో సైనిక బలగాన్ని ఉపయోగించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు.
రాజకీయ మలుపులు
జమ్మూకశ్మీర్ భారత్‌లో విలీనం అవుతుందని కాంగ్రెస్ నాయకత్వం మొదట్లో భావించలేదు. ముస్లిములు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాలు పాకిస్థాన్‌కే వెళ్తాయని వారు ఊహించారు. ఎన్నో ప్రత్యేక పరిస్థితులు అక్కడి చరిత్రను ఊహించని మలుపుతిప్పాయి. జమ్మూకశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ హిందువు. ఆ రాష్ట్రం సరిహద్దులు పశ్చిమ పంజాబ్‌తో బలంగా ముడివడి ఉన్నాయి. 1941నాటి జనాభా లెక్కల ప్రకారం ముస్లిములు 77.11 శాతం, హిందువులు 20.12 శాతం ఉన్నారు. పాకిస్థాన్‌లో కలవాలని ముస్లిం సంస్థలు ఒకవైపు పోరుపెడుతుంటే రాజరికం స్థానంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని షేక్ అబ్దుల్లా సారథ్యంలోని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆందోళన చేసింది. రాజకీయంగా కాంగ్రెస్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ అనుసరించేది. కాంగ్రెస్ చేపట్టిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమ తరహాలో ‘క్విట్ కశ్మీర్’ అంటూ మహారాజుకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. 1947 ఆగస్టు 15లోగా విలీనం విషయంలో నిర్ణయం తీసుకోవాలని మహారాజాకు మౌంట్‌బాటెన్ గట్టిగా చెప్పారు. పాకిస్థాన్‌లో కలవాలనుకున్నా అభ్యంతరం లేదనీ కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి సమస్యా రాకుండా చూస్తానని హామీ సైతం ఇచ్చాడు. సంస్థానంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 15 రానేవచ్చింది. మహారాజా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. విభజనరేఖలు ఖరారు కావడంతో పంజాబ్‌లో ఊచకోతలు మొదలయ్యాయి.
విలీన పర్వం
భారత్‌లో చేరితే సంస్థానంలో ముస్లిములు ఎలా స్పందిస్తారోనన్న భయం ఒకవైపు... పాకిస్థాన్‌లో చేరితే హిందువులకు ఏమవుతుందోనన్న భయం మరోవైపు! మహరాజా హరిసింగ్‌ది ఏ నిర్ణయం తీసుకోలేని అనిశ్చితి. ఆ దశలో పాకిస్థాన్ ప్రోద్బలంతో సరిహద్దుల్లో చొరబాట్లు మొదలయ్యాయి. రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌ని చుట్టుముట్టే ప్రమాదం వచ్చేసింది. దిక్కుతోచని మహారాజా భారత సహాయాన్ని అర్థించాడు. వెంటనే భారత రక్షణ మండలి సమావేశమైంది. అందులో మౌంట్‌బాటెన్, నెహ్రూ, పటేల్, మేనన్ ప్రభృతులున్నారు. మేనన్‌ను హుటాహుటిన శ్రీనగర్ పంపించారు. భారత్ సాయం చేయకపోతే మహారాజును చంపివేసే ప్రమాదం ఉందని, హిందువుల ఊచకోత జరుగుతుందని మేనన్ రక్షణ మండలికి నివేదించారు. చట్ట ప్రకారం సంస్థానం వేరే దేశంగా ఉండటంవల్ల సైన్యాన్ని పంపటం సాధ్యం కాదని మౌంట్‌బాటెన్ స్పష్టంచేశారు. మహారాజా భారత్‌లో చేరటానికి ఒప్పుకొంటే సైన్యాన్ని పంపటానికి వీలవుతుందని చెప్పారు. విలీనానికి మహారాజా సిద్ధంగా ఉన్నారని మేనన్ తెలిపారు. జమ్మూకశ్మీర్ జనాభా మత వైవిధ్యం దృష్ట్యా విలీనం షరతులతో తాత్కాలికంగానే ఉండాలని, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరవాత ప్రజాభిప్రాయం నిర్వహించి విలీన ప్రకియను పూర్తి చేయాల్సి ఉంటుందని మౌంట్ బాటెన్ చెప్పగా నెహ్రూ, పటేల్‌తో పాటు రక్షణమండలిలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. విలీనపత్రంపై మహారాజా సంతకం పెట్టారు. అయినా సైన్యాన్ని పంపడానికి బ్రిటిష్ సైనికాధికారులు ఒక పట్టాన అంగీకరించలేదు. సైన్యం వెళ్లకపోతే మతకల్లోలం పెట్రేగుతుందని ఆ ప్రభావం దేశమంతా ఉంటుందని నెహ్రూ గట్టిగా వాదించి ఒప్పించారు. విలీన ఒప్పంద పత్రం ప్రకారం రక్షణ, విదేశీ, కమ్యూనికేషన్ వ్యవహారాలు మాత్రమే యూనియన్ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాయి. మరోవైపు మహారాజా ఆదేశాలతో షేక్‌అబ్దుల్లా నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. భారత సైన్యం కశ్మీర్‌లో ప్రవేశించి కొన్నిరోజుల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అయినా కొంత భూభాగం పాకిస్థాన్ మద్దతుదారుల ఆధీనంలో ఉండిపోయింది. దాన్నే ‘అజాద్ కశ్మీర్’గా పిలుస్తున్నారు. చర్చలకు లాహోర్ వెళ్లిన మౌంట్‌బాటెన్- జిన్నాతో సైతం కశ్మీర్‌లో ‘ప్రజాభిప్రాయం’ (ప్లెబిసైట్) జరగాల్సిందేనని కచ్చితంగా చెప్పారు. అందుకు జిన్నా వ్యతిరేకించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం, భారత సైన్యం కశ్మీర్‌లో ఉండగా అక్కడి ప్రజలు ‘ప్లెబిసైట్’లో పాకిస్థాన్‌కు అనుకూలంగా మొగ్గుచూపబోరని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దామని మౌంట్‌బాటెన్ ప్రతిపాదించినా జిన్నా అందుకు ససేమిరా అన్నారు. ఆ తరవాత ‘ప్లెబిసైట్’పై జిన్నా వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన మౌంట్‌బాటెన్‌కు నచ్చలేదు. ఎంతకూ పీటముడి వీడకపోవటంతో ఐక్యరాజ్యసమితికి కశ్మీర్ సమస్యపై భారత్ ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి:
"ఆర్టికల్ 370 రద్దు చేస్తే.. తీవ్ర పరిణామాలు"
జమ్ము కశ్మీర్ విలీన ఒప్పందం ప్రకారం మూడు అంశాలపైనే పార్లమెంటు చట్టం చేయగలుగుతుంది. మరి మిగతా అంశాల సంగతేమిటి? ఆ ప్రశ్నకు సమాధానంగా వచ్చిందే 370-అధికరణ. రాజ్యాంగంలోని మిగతా అంశాలను కశ్మీర్‌కు వర్తింపజేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఈ అధికరణ కల్పించింది. అధికరణ 35-ఏని సైతం ఆర్టికల్-370 ఇచ్చిన అధికారాలతోనే తీసుకువచ్చారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఏదైనా అంశాన్ని రాజ్యాంగంలో చేర్చాల్సివస్తే ఆర్టికల్-370 ఇచ్చిన ఆధికారాలతో రాష్ట్రపతి నేరుగా ఆ పని చేయవచ్చు. ఇక ఆర్టికల్-370ని తొలగించాలంటే కూడా జమ్మూకశ్మీర్ అంగీకారం ఉండాలి. కశ్మీరీ స్థానికతను నిర్వచించటం, ఆస్తుల బదలాయింపుపై పరిమితులు, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రత్యేక హక్కులు వంటివన్నీ మహారాజా కాలంలో ప్రజా ఉద్యమాలవల్ల వచ్చినవే. వాటిని కొన్ని మార్పులతో ఆ తరవాత కొనసాగించారు. అలా కొనసాగించటానికి 35-ఎ అధికరణ వీలు కల్పించింది. ఇంతటి చరిత్ర ఉన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏల రద్దువల్ల కశ్మీర్ ప్రజలకు జరిగే మేలు ఏమిటో చెప్పి ఒప్పించటమే అసలు సమస్య. అలా ఒప్పించే ప్రక్రియ మొదలై, సాఫల్యం చెందితే అది ఒక గొప్ప ముందడుగే అవుతుంది. అందుకు భిన్నంగా ఏం చేసినా అది సరైన ముగింపు కాబోదు!
--ఎన్. రాహుల్ కుమార్