దేశవ్యాప్తంగా కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సైనిక బలగాలు ఆదివారం సంఘీభావం ప్రకటించనున్నాయి. సాయుధ దళాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లతో వందనం సమర్పిస్తామని ఆర్మీ ప్రజా సంబంధాల అధికారి అమన్ ఆనంద్ తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతూ.. సంఘీభావం తెలపనున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా యోధులకు కృతజ్ఞతలు చెప్పేందుకు మే 3న వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని మహా దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ శుక్రవారమే ప్రకటించారు.
కార్యక్రమం ఇలా సాగనుంది..
- ఉదయం దిల్లీ పోలీసుల స్మారక చిహ్నం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల గౌరవార్థం ఇక్కడి స్మారకానికి దండలు వేసి ప్రత్యేక వందనం సమర్పిస్తారు.
- అనంతరం భారత వాయుసేనకు చెందిన యుద్ధ, రవాణా విమానాలు.. దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య చక్కర్లు కొడుతాయి.
- ఈ విమానాలు.. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం.. దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు అన్ని ప్రధాన పట్టణాల గగనతలాలను తాకుతాయి.
- కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై వాయుసేన, నౌకా దళ హెలికాప్టర్లు పూరేకులను చల్లుతాయి.
- కొన్ని విమానాలను 500 మీటర్ల ఎత్తులో చక్కర్లు కొట్టిస్తారు. ఇళ్లల్లో ఉన్న ప్రజలకు సంఘీభావంగా ఈ విన్యాసం చేస్తారు.
- కరోనా ఆసుపత్రుల ప్రాంగణంలో దేశభక్తి గీతాలతో మిలిటరీ బ్యాండ్లు వాయిస్తూ వైద్యులకు కృతజ్ఞతను తెలపనున్నారు.
- ముంబయి, విశాఖపట్నం, గోవా, కొచ్చిన్‌లోని ఆసుపత్రులపై నౌకాదళ హెలికాప్టర్లు ప్రత్యేకంగా పూలను చల్లుతాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య కొనసాగుతుంది.
- ముంబయిలోని 'గేట్‌వే ఆఫ్ ఇండియా' పశ్చిమ తీర నౌకాదళానికి చెందిన 5 ఓడల్లో.. రాత్రి 7.30 నుంచి 11.59 గంటల మధ్య దీపాలను వెలిగిస్తారు. "ఇండియా సెల్యూట్స్ కరోనా వారియర్స్" బ్యానర్లను ప్రదర్శిస్తారు. రాత్రి 7.30 గంటలకు ఫైర్ ఫ్లేర్స్తోపాటు సైరన్‌ను మోగిస్తారు. విశాఖపట్నంలో రెండు ఓడల్లో దీపాలను వెలిగిస్తారు.
- ఈ రెండు నగరాలు మినహా.. మిగిలిన 24 నౌకాశ్రయాల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడలు కనిపిస్తాయి.
ఇదీ చూడండి:'కరోనా యోధులకు మే 3న త్రివిధ దళాల వందనం'