కరవుతో బుల్ఢాణా జిల్లా దశాబ్దాలపాటు విలవిల్లాడింది. ఆర్థికంగా కుదేలైంది. కొన్ని గ్రామాల్లో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉండేదంటే.. ఆ ఊళ్లలోని యువకులకు పిల్లనిచ్చేందుకూ ఎవరూ వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ‘జల క్రాంతి’ వెలుగు రేఖగా మారింది.
2015 జూన్ 5న ‘జల క్రాంతి అభియాన్’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా బుల్ఢాణా జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడిక తీశారు. దాదాపు 22 వేల బావులకు మళ్లీ ప్రాణం పోశారు. చెక్‌డ్యాములను నిర్మించారు. ఊట చెరువులు తవ్వించారు. ఈ ఊట చెరువులు కృత్రిమ రిజర్వాయర్లను తలపిస్తాయి. సింది హరాళి ప్రాంతం వద్ద ఊట చెరువు చుట్టూ గోధుమ, చెరకు, బార్లీ పంటలు దర్శనమిస్తుంటాయి.
మౌలిక వసతుల కల్పనలోనూ..
బుల్ఢాణాలో చేపట్టిన ‘జల క్రాంతి’ పనుల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలకంగా వ్యవహరించింది. జిల్లాలో మొత్తం 61 ఊట చెరువులను తవ్వగా.. అందులో 34 ఎన్‌హెచ్‌ఏఐ తవ్వించినవే. వాటితోపాటు చెరువులు, బావుల్లో పూడికతీతతో దాదాపు 52.10 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో మట్టి, కంకర లభ్యమయ్యాయి. వాటిని జాతీయ రహదారి-53 నిర్మాణ పనుల్లో సంస్థ ఉపయోగించుకుంది. దీంతో అటు జల సంరక్షణకు, ఇటు మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం దోహదపడినట్లయింది.
మా ఊరికి ఐశ్వర్యమొచ్చింది
నీటి లభ్యత పెరిగి, పంటలు బాగా పండుతుండటంతో బుల్ఢాణా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘నీరు తక్కువగా అవసరమయ్యే సోయాబీన్ పంటను కూడా మేం గతంలో పండించలేకపోయేవాళ్లం. తాగునీరు కావాలంటే ట్యాంకర్ల కోసం ఎదురుచేసేవాళ్లం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. బావుల్లో నీటి లభ్యత బాగా పెరిగింది. చెరవులు నిండాయి’’ అని వివరించారు షెలూడ్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల శ్రీపాద్ జాదవ్. ‘‘ఐశ్వర్యం మా ఊరిని చేరింది. ఈ పంటల్ని చూడండి’’ అని ఆనందం నిండిన కళ్లతో చెప్పారు బిమల్‌బాయ్ సుఖ్‌దేవ్.