వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను తిరిగి అప్పగించడం దౌత్యపరమైన విజయమని భాజపా అధినేత అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. పుల్వామా దాడిని ఖండిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒక్క ప్రకటనా చేయలేదని షా విమర్శించారు. ఇమ్రాన్‌ను ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. పరిస్థితులు పాక్ ప్రధాని నియంత్రణలో ఉండి ఉండకపోవచ్చు కానీ ఓ ప్రకటనా విడుదల చేయలేకపోవడం సరికాదన్నారు షా.
'అభినందన' విజయమే - అభినందన్
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ తిరిగి భారత్‌కు అప్పగించటం దౌత్య విజయమని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు.
దిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు షా. పుల్వామా దాడి అనంతర పరిణామాలపై స్పందించారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులలో భయం పుట్టేలా ప్రతిస్పందించిందన్నారు. ఉగ్రవాద వ్యవహారాల్లో భారత ప్రభుత్వ తీరు మునుపెన్నడూ లేనివిధంగా ఉందని కమలదళపతి అభిప్రాయపడ్డారు. భాజపా ప్రభుత్వ పాలనలోనే ఎక్కువమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నారు షా.
పాక్ యుద్ధ విమానాల్ని నిరోధించే క్రమంలో మిగ్-21 విమానం పాక్ భూభాగంలో కూలింది. దానికి పైలట్‌గా ఉన్న అభినందన్ పారాషూట్ ద్వారా పాక్‌లో దిగి ఆ దేశ సైనికులకు చిక్కారు. శాంతికాముక చర్యగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆయనను స్వదేశానికి పంపిస్తామని గురువారం ప్రకటించారు.